Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కష్టాల్ని దాటేందుకు !
- 'సరోగేట్'గా ఉంటామంటూ హాస్పిటల్స్‌ను సంప్రదిస్తున్న మహిళలు
- హైదరాబాద్‌లో 10 రెట్లు పెరిగిన ఎంక్వైరీలు!
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం ఎన్నో కుటుంబాల్ని ఆర్థికంగా చిదిమేసింది. మొదటి వేవ్ సమయంలో ఆర్థిక కష్టాల్ని, నష్టాల్ని ఎదుర్కోవడానికి బంగారం తాకట్టు పెట్టడమో! నడుస్తున్న దుకాణంపై అప్పు తెచ్చుకోవటమో చేసేవారు. రెండో వేవ్ అనంతరం పరిస్థితులు మరింత దిగజారి..అనేక కుటుంబాలు ఆర్థికంగా పతనమయ్యాయి. ఇప్పుడు వారు అప్పు చేసే పరిస్థితి కూడా లేదు. అహ్మదాబాద్, ముంబయి, పూణె, హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు..తదితర నగరాల్లో ముఖ్యంగా వ్యాపార కుటుంబాల్లోని మహిళలు భర్త ఆర్థిక సమస్యలు తీర్చడానికి ఎంతో రిస్క్ తీసుకుంటున్నారు. 'సరోగేట్' (అద్దె గర్భం)గా వ్యవహరిస్తామంటూ ప్రయివేటు హాస్పిటల్స్‌ను సంప్రదిస్తున్నారు.
భార్యభర్త ఇద్దరిలోనూ సంతాన సమస్యలుంటే..వైద్యులు ఎక్కువగా 'సరోగసి'ని సూచిస్తారు. ఈ విధానంలో సంతానం పొందాలంటే ఆ దంపతులకు 'అద్దె గర్భం' కావాలి. దీనిని అందజేసే మరో మహిళను 'సరోగేట్'గా వైద్యులు పేర్కొంటారు. ఇలా సరోగేట్‌గా వ్యవహరించే మహిళలను వివిధ నగరాల్లో హాస్పిటల్సే సూచిస్తుంటాయి. 'సరోగేట్' మహిళకు భారీ మొత్తంలో(సుమారుగా రూ.5 నుంచి 10లక్షలు) నగదు అందజేస్తున్నారు. అయినప్పటికీ సరోగేట్ దొరకటం చాలా కష్టంగా ఉండేది. అయితే కరోనా రెండో వేవ్ అనంతరం 'సరోగేట్' కోసం ముందుకు వచ్చే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో వీరి సంఖ్య 10రెట్లు పెరిగిందని ఒక వైద్య నిపుణుడు మీడియాకు తెలిపారు.ఎందుకు మీరు సరోగేట్‌గా మారాలనుకుంటున్నారు? అని 100మంది మహిళల్ని విచారణ చేయగా, భర్త ఆర్థిక కష్టాల్ని తీర్చడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. ముంబయి, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగుళూర్, చెన్నై..తదితర నగరాల్లో ఈమధ్య కాలంలో 'సరోగసీ' ద్వారా శిశుజననాలు పెరిగాయని సమాచారం. పలు కార్పొరేట్ హాస్పిటల్స్ అందిస్తున్న 'కమిర్షియల్ సరోగసీ'(వ్యాపారాత్మకమైనది)ని నిషేధిస్తూ కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. 'ద సరోగసి బిల్లు, 2019'లో పేర్కొన్న నిబంధనల ప్రకారం..సరోగసి ద్వారా పిల్లలు పొందాలనుకునే దంపతులు ఎంచుకున్న 'సరోగేట్', వారికి అత్యంత దగ్గరి బంధువు అయి వుండాలి. అయితే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాల్సి వుంది.