Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టులో 16లక్షలమంది ఉద్యోగాలు పోయారు..
- జాతీయ నిరుద్యోగ రేటు 8.32 శాతం : సీఎంఐఈ
- పట్టణాల్లో 9.78 శాతం, గ్రామాల్లో 7.64 శాతం నమోదు
- తెలంగాణలో నిరుద్యోగరేటు 4.7శాతం
- హర్యానాలో అత్యధికం, సిక్కింలో అత్యల్పం
- ఏటా రెండుకోట్లమందికి ఉద్యోగాలిప్పిస్తాం. నిరుద్యోగ భారత్‌లా మారిపోయింది. ఒక్కసారి అధికారమిస్తే ఇక ఉపాధికి ఎలాంటి ఢోకా ఉండదు...
- 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పీఎం అభ్యర్థి మోడీ
ఏడేండ్లు గడిచినా ఉద్యోగాలకోసం నిరుద్యోగులు కండ్లల్లో ఒత్తులుపెట్టుకుని ఎదురుచూస్తున్నారు. కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయటంలేదు. ప్రభుత్వరంగసంస్థల్ని హౌల్సేల్గా అమ్మేస్తామంటున్నది. ప్రయివేట్ సంస్థల్లోనూ రిజర్వేషన్లు ఉండవని మోడీ క్యాబినెట్ స్పష్టంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు..ఉపాధి గురించే నిరుద్యోగ యువత ఆందోళనచెందుతున్నది. మన్కీబాత్లలో కూడా నిరుద్యోగ సమస్య గురించి మోడీ ఒక్కమాట మాట్లాడటంలేదు. పైగా పకోడాలు అమ్ముకుని బతకండని బీజేపీ నేతలంతా ఇస్తున్న ఉచితసలహాలతో యువతలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఆగస్టునెలలో 16 లక్షలమంది ఉద్యోగాలు గల్లంతవటంతో..రెండుసార్లు గెలిపించాక కూడా ఉద్యోగాలేవని నిరుద్యోగలోకం ప్రశ్నిస్తున్నది.
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం మళ్లీ పెరిగింది. ఒక్క ఆగస్టు నెలలోనే 16 లక్షల మంది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారనీ, దీంతో ఆగస్టులో నిరుద్యోగ రేటు 8.32 శాతంగా నమోదయ్యిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండి యన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు పెరిగింది. అయితే అది గ్రామీణ నిరుద్యోగం కంటే, పట్టణ నిరుద్యోగం ఇంకా ఎక్కువ ఉన్నది.జులైలో ఉపాధి పొందిన వారి సంఖ్య 399.38 మిలియన్లు ఉంటే, ఆగస్టు నాటికి 397.78 మిలియన్లకు తగ్గింది. దీంతో సంఘటిత, అసంఘిత రంగాలకు చెందిన 16 లక్షల మందికి పైగా తమ ఉద్యోగాలను కోల్పోయా రని తెలిపింది. జాతీయ నిరుద్యోగ రేటు జులైలో 6.95 శాతం నమోదయిందనీ, ఆగస్టు నాటికి అది 8.32 శాతానికి పెరిగిందని తెలిపింది. పట్టణ నిరుద్యోగ రేటు జూలైలో 8.30 నమోదు కాగా, ఆగస్టులో 9.78 శాతానికి పెరిగింది. గ్రామీణ నిరుద్యోగ రేటు జూలైలో 6.34 శాతం కాగా, ఆగస్టు నాటికి 7.64 శాతానికి పెరిగింది. మొత్తం జాతీయ నిరుద్యోగ రేటు 1.37 శాతం పెరగగా, పట్టణ నిరుద్యోగ రేటు 1.48 శాతం, గ్రామీణ నిరుద్యోగ రేటు 1.3 శాతం పెరిగింది.
ఉపాధి రేటు పడిపోయినప్పటికీ, కార్మికశక్తిలో ప్రాతినిధ్య రేటు ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. ఇది జాబ్ మార్కెట్లో పనిచేస్తున్న వారి సంఖ్యను, కార్మికశక్తి పరిమాణాన్ని తెలియజేస్తుంది. నెలవారీ సీఎంఐఈ డేటా ప్రకారం జులైలో దాదాపు 30 మిలియన్ల మందితో పోలిస్తే, 36 మిలియన్ల మంది ప్రజలు చురుకుగా పని కోసం ఎదురు చూస్తున్నారని తేలింది. మొత్తం కార్మిక శక్తి పరిమాణం 433.86 మిలియన్లకు పెరిగింది. ఇది జులై కంటే దాదాపు నాలుగు మిలియన్లు ఎక్కువ. ఇప్పుడు ఎంత మంది ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారో స్పష్టం అయింది. వాస్తవానికి ఆగస్టులో కార్మిక శక్తి పరిమాణం, మార్చి 2020కి దాదాపు సమానంగా ఉంది. గత కొన్నేండ్లుగా భారతదేశం కఠినమైన ఉపాధి కొరతను ఎదుర్కొంటుంది. కోవిడ్ వ్యాప్తి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, జాబ్ మార్కెట్ కష్టపడుతోంది. దేశంలో ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికీ రెండంకెల నిరుద్యోగ రేటు నమోదు అయింది.
తెలంగాణలో నిరుద్యోగం 4.7శాతం
తెలంగాణతో పోల్చితే ఏపిలోనే నిరుద్యోగం ఎక్కువ ఉంది. తెలంగాణలో నిరుద్యోగరేటు 4.7 శాతం నమోదుకాగా, ఆంధ్రప్రదేశ్‌లో 6.5 శాతం ఉందని తేలింది. పుదుచ్చేరి (8.6 శాతం) ఉత్తరప్రదేశ్ (7 శాతం), పశ్చిమ బెంగాల్ (7.4 శాతం), కేరళ (7.8 శాతం), అసోం (6.7 శాతం), తమిళనాడు (6.3 శాతం), పంజాబ్ (6 శాతం) నిరుద్యోగ రేటు నమోదైంది. సిక్కింలో మాత్రం ఆగస్టులో నిరుద్యోగ రేటు సున్నాగా నమోదైంది.
హర్యానాలో 35.7 శాతం
బీజేపీ పాలిత హర్యానా 35.7 శాతం నిరుద్యోగ రేటుతో దేశంలోని అత్యంత ఎక్కువ నిరుద్యోగం కలిగిన రాష్ట్రంగా నిలిచింది. తరువాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్ (26.7 శాతం), జార్ఖండ్ (16 శాతం), త్రిపుర (15.6 శాతం), బీహార్ (13.6 శాతం), జమ్మూ కాశ్మీర్ (13.6 శాతం), గోవా (12.6 శాతం), ఢిల్లీ (11.6 శాతం) నిరుద్యోగ రేటు నమోదు అయింది.
''లేబర్ మార్కెట్ తిరోగమన పరిస్థితి కనీసం మరికొన్ని నెలలు కొనసాగుతుంది. సంఘటిత రంగాలు దృష్టి పెట్టకపోతే, నాణ్యమైన ఉద్యోగాల పునరుద్ధరణకు సమయం పడుతుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం తక్కువగా ఉన్నది'' అని కార్మిక ఆర్థికవేత్త కె.ఆర్ శ్యామ్ సుందర్ అన్నారు.