Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ అల్లర్ల కేసులో ఐదుగురికి బెయిల్
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ అల్లర్ల ఘటన సమయంలో చోటుచేసుకున్న హెడ్‌కానిస్టేబుల్ రతన్‌లాల్ హత్య, డిసిపిపై దాడి కేసుకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. రూ.35 వేల వ్యక్తిగత పూచీకత్తు చెల్లించాలని, అదేవిధంగా న్యాయస్థానం అనుమతి లేకుండా దేశ రాజధాని విడిచిపోకూడదని ఫుర్కాన్, మహ్మద్ ఆరిఫ్, షదాబ్ అహ్మద్, సువలీన్, తబస్సుమ్లను ఆదేశించింది. బెయిల్ మంజూరు సందర్భంగా జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు విచారణకు ఇంకా చాలా పట్టే అవకాశం కనిపిస్తోందని, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిందితులను దీర్ఘకాలం పాటు కటకటాల వెనుక ఉంచేందుకు వీల్లేదని, వారిపై ఉన్న ఆరోపణల వాస్తవికతను విచారణలో నిరూపించుకోవాలని స్పష్టం చేశారు. మహ్మద్ ఆరిఫ్ విషయంలో అస్పష్టమైన సాక్ష్యాధారాలు, సాధారణ ఆరోపణలతో ఐపిసిలోని సెక్షన్ 149, 302లను మోపలేరని పేర్కొన్నారు. భారీగా జనం పాల్గొన్న సమయంలో.. చట్టవిరుద్ధమైన సమావేశంలో పాల్గొన్న ప్రతి సభ్యుడికి ఒకేవిధమైన ఉద్దేశం ఉంటుందని చెప్పలేమని అన్నారు. ప్రభుత్వాలు వ్యక్తిగత స్వేచ్ఛను ఏకపక్షంగా హరించకుండా చూసుకోవడం న్యాయస్థానాల రాజ్యాంగపరమైన విధి అని ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. బెయిల్ అనేది ఒక రూల్, జైలు అనేది ఒక మినహాయింపు అని, న్యాయస్థానాలు వ్యక్తిగత స్వేచ్ఛ సిద్ధాంతాలను సమర్థించేందుకు వారి అధికార పరిధిని తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది. నిందితులను ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, వారిని అధికారులు అక్రమంగా ఇరికించారని నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.