Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఈ ఏడాది జేఈఈ (మెయిన్స్) పరీక్షలో ఒక ప్రయివేటు ఇన్స్టిట్యూట్ అఫినిటీ ఎడ్యుకేషన్ ప్రయివేట లిమిటెడ్, దాని డైరెక్టర్లు చేసిన అవకతవకలకు సంబంధించి సీబీఐ 19 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తెలిపారు. '' ఈ సోదాల్లో 25 ల్యాప్టాప్లు, ఏడు పీసీలు, దాదాపు 30 పోస్ట్ డేటేడ్ చెక్కులతో పాటు వివిధ నేరస్థుల డాక్యుమెంట్లు, డివైజ్లు, వివిధ విద్యార్థుల పీడీసీ మార్క్షీట్ లు రికవరీ చేశాం'' అని సీబీఐ ప్రతినిధి ఆర్.సీ జోషి అన్నారు. సీబీఐ బృందాలు ఢిల్లీ, ఎన్సీఆర్, పూణే, జంషెడ్పూర్, ఇండోర్, బెంగళూరులలో 19 ప్రదేశాలలో సోదాలు నిర్వహించాయని అధికారులు తెలిపారు. అఫినిటీ ఎడ్యుకేషన్ ప్రయివేట్ లిమిటెడ్, దాని ముగ్గురు డైరెక్టర్లు, సిద్ధార్థ్ కృష్ణ, విశ్వంభర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్ష్నీ, ఇతరులపై కేసు నమోదు అయిన తర్వాత సీబీఐ ఈచర్యకు దిగడం గమనార్హం. '' ఈ కేసుకు సంబంధించి పలువురిని ప్రశ్నిస్తున్నాం. దర్యాప్తు కొనసాగుతున్నది'' అని జోషి తెలిపారు.