Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై : ప్రజల సొత్తును కేంద్రప్రభుత్వం ప్రయివేటీకరించడం దారుణం. దీన్ని ఎంతమాత్రం సహించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు. చెన్నై కలైవానర్ అరంగంలో నిర్వహించిన అసెంబ్లీ కార్యక్రమాల్లో ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వైద్య, ప్రజారోగ్యశాఖలపై సభ్యుల మధ్య చర్చ సాగింది. ఈ సమయంలో సభ్యులు పలు తీర్మానాలను ప్రవేశపెట్టి వారి అభిప్రాయాలను వెల్లడించారు.
అంగడి సరుకుగా మార్చేశారు...
కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సెల్వపెరుమాళ్, సీపీఐ సభ్యుడు రామచంద్రన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజా పనులశాఖ 70 ఏండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఆస్తులను ఏడేండ్లుగా అధికారంలో ఉన్న కేంద్రప్రభుత్వం అమ్ముకుంటూ వస్తున్నదని విమర్శించారు. ఊటీ రైల్వే పథకం, విమానాశ్రయం, జాతీయ రహదారుల శాఖ, హార్బర్ వంటి వాటినన్నింటినీ అంగడి సరుకుగా మార్చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.
ఇది ఒక్క తమిళనాడు సమస్య కాదు, దేశ సమస్యగా భావించాలని అన్నారు. ఈ దురాగతాన్ని ముఖ్యమంత్రి అడ్డుకోవాలి, పారంపర్య ఆస్తులను కాపాడుకోవాలని కోరారు. అందుకు వాణిజ్యశాఖమంత్రి తంగం తెన్నరసు బదులిస్తూ... ఈ వ్యవహారాన్ని తమ ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు.
ప్రధాని మోడికి లేఖ రాస్తా : స్టాలిన్
ప్రజాపనులశాఖ పరిధిలోని సంస్థలు మనందరి సొత్తు అని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. లాభాపేక్షకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని స్థాపించిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రజల ఆస్తులను ప్రయివేటుపరం చేయడం సబబు కాదని ప్రధాని మోడీకి ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నట్టు స్టాలిన్ తెలిపారు.