Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే 39 మంది మృతి.. అందులో 32 మంది చిన్నారులు
- ఆగస్టు 18న తొలికేసు.. సీఎం యోగి వెల్లడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే కరోనా మహమ్మారి పంజా విసురుతూ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు సైతం మెరుగ్గలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో యూపీ ప్రజలను మరో మాయదారి జ్వరం భయాందోళనలకు గురిచేస్తోంది. అంతుబట్టని ఈ జ్వరాల కారణంగా ఇప్పటికే 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏడుగురు పెద్దవారు కాగా, 32 మంది చిన్నారులు ఉండటంపై స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్రువీకరించారు. ఫిరోజాబాద్ జిల్లాలో దాదాపు 9 చోట్ల డెంగ్యూ లాంటి అంతుబట్టని వైరల్ జ్వరాలతో జనాలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. అలాగే, జిల్లాలో ఉన్న చిన్న పిల్లల ఆస్పత్రిని సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఫిరోజాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఇలాంటి జ్వరాల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. కరోనాకూ ప్రత్యేక వార్డును సిద్ధం చేశాం. అధికారులను సైతం అప్రమత్తం చేశాం' అని అన్నారు. ఇదిలావుండగా, వారంతా డెంగ్యూతో చనిపోయారన్న వార్తలను కొట్టిపారేశారు. ఈ జ్వరాలపై కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఈ జ్వరాలపై అవగాహన లేకపోవడం వల్ల పేషెంట్లను స్థానిక ప్రయివేటు ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ నెల 18న తొలి కేసును గుర్తించారన్నారు.
ఈ కేసుల్లో 90 శాతం బాధితులు పిల్లలే..
ఈ అంతుబట్టని జ్వరాల బారినపడుతున్న వారిలో 90 శాతం బాధితులు పిల్లలే ఉన్నారని స్టేట్ మెడికల్ హస్పిటల్ ప్రిన్సిపల్, డీన్ డాక్టర్ సంగీత అనీజా అన్నారు. ఈ వ్యాధి సాధారణ లక్షణాలు అతిసారం, వాంతులు, అధిక జ్వరం వంటివి ఉన్నాయని తెలిపారు. గత ఐదు రోజుల్లో ఈ కేసులు అకస్మాత్తుగా పెరిగాయని తెలిపారు. వారి శరీర ఉష్ణోగ్రత 102 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటున్నదని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 200 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని చెప్పారు.
పారిశుధ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
స్థానికంగా ప్రభుత్వం పారిశుధ్య చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ సిబ్బందిగానీ, ఆరోగ్య సిబ్బందిగానీ అసలు పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించడం లేదని పేర్కొంటున్నారు. దీని కారణంగా చాలా వరకు డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయన్నారు. అధికారులు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన స్పందన కరువైందని పేర్కొన్నారు.
తాజాగా ప్రజలు అంతుబట్టని జ్వరాల బారినపడుతూ ప్రాణాలు కోల్పోవడాని ప్రభుత్వమే కారణమంటూ పలువురు ఆరోపిస్తూ..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, యూపీ ఆరోగ్య మంత్రి జైప్రతాప్ సింగ్ మాత్రం మరణించినట్టు వచ్చిన వార్తలు ఇదివరకు ఖండిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి నివేదికలు అందలేని చేప్పుకురావడం గమనార్హం.
నిపుణుల బృందాన్ని తరలించిన కేంద్రం
ఉత్తర యూపీలోని ఫిరోజ్‌బాద్ జిల్లాలో గడిచిన 10 రోజుల్లో సుమారు 50 మంది డెంగ్యూతో చనిపోగా.. అందులో 40 మంది చిన్నారులు ఉండటం ఆందోళనకు గురిచేస్తున్నది. డెంగ్యూకు తీవ్ర రూపమైన 'డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్' కారణంగా ఈ మరణాలు సంభవించాయని యోగి సర్కార్ చెబుతున్నది. మరికొన్ని ఉత్తర యూపీ జిల్లాలైన మధుర, ఆగ్రాల్లో కూడా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్లతో, డీ హైడ్రేషన్‌కు గురైన చిన్నారులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.
కాగా, ఈ హేమరేజిక్ ఫీవర్ చాలా ప్రమాదకరమైనదనీ, ప్లేట్లెట్ల సంఖ్య అకస్మాత్తుగా పడిపోతాయనీ, తీవ్ర రక్తస్రావం అవుతుందని డబ్ల్యూహెచ్ఓ బృందం చెప్పినట్టు ఫిరోజ్‌బాద్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర విజరు అన్నారు. దీంతో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), నేషనల్ వెక్టర్‌బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌కు చెందిన నిపుణుల బృందాన్ని ఫిరోజ్బాద్కు తరలించారు. ఈ బందం అక్కడి ఆరోగ్య శాఖ అధికారులకు సాయం చేయనుంది. ఫిరోజ్‌బాద్‌లో ఒక్క గురువారమే ఆరుగురు మృతిచెందగా.. అందులో ఆరేండ్ల చిన్నారి కూడా ఉంది. కాగా, డెంగ్యూ ఆస్పత్రి ప్రాంగణమంతా బాధితుల రోదనలతో నిండిపోయింది. అయితే మృతదేహాలను తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌లు కూడా ఏర్పాటుచేయడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.