Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో 77 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : అనేక కుటుంబాలు ఎంతో కాలం కష్టపడి ప్రతీ రూపాయి పొదుపు చేసుకుని ఎన్నో ఆశలు.. ఎంతో మురిపంతో కొనుగోలు చేసిన బంగారు అభరణాలు పసిడి తనఖా లాకర్లకు చేరుతున్నాయి. ఉపాధి తగ్గి, ఖర్చులు పెరగడంతో అవసరాల కోసం మరోమార్గం లేక బంగారాన్ని తనఖా పెడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. గడిచిన 12 నెలల్లో దేశంలో అనేక రంగాలు స్తబ్దతను ఎదుర్కొంటున్నాయి. కానీ వ్యక్తిగత అప్పు, బంగారం తనఖా రుణాల సంరస్థల వ్యాపారాలు మాత్రం దూసుకుపోతున్నాయి. మొత్తం బ్యాంక్ రుణాల్లో రిటైల్ రుణాల వాటా ఏకంగా 11.2 శాతం నుంచి 26 శాతానికి ఎగిసింది. జులై 2021తో ముగిసిన 12 మాసాల కాలంలో బంగారం రుణాలు 77.4 శాతం లేదా రూ.62,412 కోట్లు పెరిగాయి. 2020 ఇదే జులై నాటికి ముగిసిన ఏడాదిలో ఈ రంగం రుణాలు రూ.27,223 కోట్లుగా నమోదయ్యాయి. బంగారం తనఖా రుణాల్లో 338.76 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ఎస్బీఐ అధికారి ఒక్కరు తెలిపారు. జులైకి ముందు 12 మాసాల్లో దాదాపుగా రూ.21,293 కోట్ల బంగారం రుణాలు జారీ చేశామన్నారు.
ప్రధాన కారణాలు..
దేశ వ్యాప్తంగా కరోనా సంక్షోభం, లాక్డౌన్ నిబంధనలు ఉద్యోగాలు ఊడిపోవడం, ఉన్న వేతనాల్లో కోతలు, అధిక వైద్య వ్యయాలు తదితర అంశాలు పసిడి తనఖా వ్యాపారాలను తారాస్థాయికి తీసుకెళ్లాయని ఆ జాతీయ బ్యాంక్ అధికారి పేర్కొన్నారు. కాగా ఆయన పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఆదాయాలు పడిపోవడంతో ప్రజలు సులభ రుణాల వైపు మొగ్గు చూపారన్నారు. ఇదే సమయంలో ఈ రంగం రుణాలను అందిపుచ్చుకోవడంపై విత్త సంస్థలు, బ్యాంక్లు దృష్టి పెట్టాయన్నారు.
క్రెడిట్ కార్డులు వాడేశారు..
2021 జులైతో ముగిసిన 12 మాసాల కాలంలో క్రెడిట్ కార్డుల రుణాల వాడకమూ 9.8 శాతం లేదా రూ.10వేల కోట్లు పెరిగి రూ.1.11 లక్షల కోట్లకు చేరాయి. అనేక మంది మధ్య తరగతి వారు తమ అవసరాలను తీర్చుకోవడానికి క్రెడిట్ కార్డులను ఎంచుకున్నారు. మరోమార్గం లేక అధిక వడ్డీ చెల్లించడానికి ముందుకు వచ్చారు. మరోవైపు వ్యక్తిగత రుణాలు రూ.2.88 లక్షల కోట్లు పెరిగి రూ.28.58 లక్షల కోట్లకు చేరాయని ఆర్బీఐ గణంకాలు చెబుతున్నాయి. దేశంలో సర్వీసు సెక్టార్లో స్తబ్దత నెలకొనడంతో రిటైల్, క్రెడిట్ కార్డుల మొత్తం రుణాలు ఏకంగా రూ.108.32 లక్షల కోట్లకు చేరాయి. 2021 జులై ముగింపు నాటికి వాహన రుణాల్లో 7.3 శాతం లేదా రూ.2,65,951 కోట్ల పెరుగుదల చోటు చేసుకుంది. ఇంతక్రితం ఏడాదితో ఈ విభాగం రుణాల్లో 2.7 శాతం పెరుగుదల మాత్రమే ఉంది.
పెరిగిన వేలం ప్రకటనలు..
గడిచిన కొన్ని నెలలుగా పత్రికల్లో బంగారం తనఖా ప్రకటనలు భారీగా పెరుగుతున్నాయి. అప్పులు చెల్లించలేని ఖాతాదారుల అభరణాలను ఇది వరకు ఎప్పుడూ లేని స్థాయిలో విత్త సంస్థలు వేలం వేస్తున్నాయి. కరోనా రెండో దశ తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటికీ ఉపాధి కల్పనలో పెద్ద పురోగతి లేకపోవడం వల్ల తీసుకున్న అప్పులు చెల్లించలేని దుస్థితిలో అనేక కుంటుంబాలు చిక్కుకున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో బంగారాన్ని పూచీగా పెట్టుకుని అప్పులిచ్చిన విత్త సంస్థలు గడవు తీరగానే వాటిని వేలం వేస్తున్నాయి.