Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఎదుట ఐద్వా ఆందోళన
- మోడీది దేశద్రోహి ప్రభుత్వం : మరియం ధావలే
న్యూఢిల్లీ : వంట గ్యాస్, నిత్యావసర వస్తువల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. శుక్రవారం ఐద్వా ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయం (శాస్త్రి భవన్) ఎదుట ధర్నా నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో మహిళలు నిరసనకార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని ''పేదలను లూటీ చేయడం ఆపాలి. మోడీ, అమిత్ షా డౌన్ డౌన్. గ్యాస్ ధరలు తగ్గించాలి. దేశాన్ని దోచుకుంటున్నారు. అదానీ, అంబానీ డౌన్ డౌన్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. పెంచిన ధరలు వెనక్కి తీసుకోవాలి'' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధర ల పెరుగుదలను ఐద్వా తీవ్రంగా ఖండించింది.ఐద్వా ఆందోళన నేపథ్యంలో భారీస్థాయిలో ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. మహిళలు లోపలికి వెళ్లకుండా ప్రధాన గేటును మూసివేయగా..అక్కడే మహిళలు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మాట్లాడుతూ రెండు వారాల్లో వంటగ్యాస్ ధర రెండుసార్లు పెరిగిందని తెలిపారు. 50 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతున్నారనీ, సబ్సిడీ ఎత్తివేసే వరకు అలా పెంచుతారని విమర్శించారు. అప్పుడు సబ్సిడీ గ్యాస్ ధర, నాన్ సబ్సిడీ గ్యాస్ ధరకు సమానం అవుతుందని వివరించారు. దీంతో సబ్సిడీ గ్యాస్ ఉండదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకునేందుకే ఈ కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఆరు నెలల్లో వంట గ్యాస్ రూ.150 పెంచారని వివరించారు. మోడీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ఉజ్వల యోజన, లూటీ యోజనగా తయారు అవుతుందని విమర్శించారు. బ్యాంక్ అకౌంట్ల్లో సబ్సిడీ డబ్బులు తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందనీ, మొదట్లో అక్కడక్కడ పడ్డాయనీ, కానీ ఇప్పుడు డబ్బులు ఏ ఖాతాలోనూ పడటం లేదని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనీ, కరోనా ముసుగులో లూటీ చేస్తున్నారని ఆరోపించారు. దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే, ప్రధాని మోడీ ప్రజా, రైతు, పేదల వ్యతిరేక విధానాలతో దేశ ప్రజలపై పోరాటం చేస్తున్నారని విమర్శించారు. అదానీ, అంబానీ వంటి కొంత మంది కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేస్తున్నారనీ, మరోవైపు పేదలపై లక్షల కోట్లు భారాలు మోపుతున్నారని తెలిపారు. విజరు మాల్యా వేల కోట్లు లూటీ చేసి దేశం వదిలి వెళ్లిపోతే ఏమీ చేయని ప్రభుత్వం, ప్రజా సమస్యలపై పోరాడుతున్నవారిపై నిర్బంధం విధిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వ వైఖరి పట్ల మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనీ, మహిళలు తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. మోడీది దేశద్రోహి ప్రభుత్వమని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామనీ, సెప్టెంబర్ 25న జరిగే భారత్ బంద్ విజయవంతం కోసం పెద్ద ఎత్తున మహిళలను సమీకరిస్తామని చెప్పారు. ఈ ఆందోళనలో ఐద్వా ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు మోమూనా మొల్లా, ఆశా శర్మ, సీఈసీ సభ్యురాలు సర్బానీ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.