Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టును మోసం చేస్తున్న కేంద్రం
- అసంఘటిత కార్మికుల 'రిజిస్ట్రేషన్'పై ఎన్నోమార్లు నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం
- 'శ్రమ్ సువిధా పోర్టల్'ను తెచ్చామన్న మోడీ సర్కార్
- అత్యంత రహస్యంగా పోర్టల్ మూసివేత
- మళ్లీ కొత్త పేరుతో 'యూనిఫైడ్ శ్రమ్ సువిధా పోర్టల్' ప్రారంభం
మనదేశంలో అసంఘటితర రంగంలోని కార్మికుల సమస్యలపై (24 మార్చి 2017) సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుచేసింది. కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అనేకమార్లు ఆదేశించినా..కేంద్రం స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేసే పథకాలతో వారికి మేలు జరగాలంటే..రిజిస్ట్రేషన్ ప్రక్రియ అత్యంత కీలకమని సుప్రీం అభిప్రాయపడింది. అయితే ఇదంతా వింటూనే మోడీ సర్కార్ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అబద్ధాల మీద అబద్దాలు చెబుతూ సుప్రీంకోర్టునే కేంద్రం మోసం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
న్యూఢిల్లీ : నేడు దేశంలో ఎన్నో కోట్లమంది అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలోని కార్మికుల కోసం సామాజిక, సంక్షేమ పథకాలెన్నో ఉన్నాయి. వీటి అమలు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలంటే 'కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ' అత్యంత కీలకమని సుప్రీంకోర్టు భావించింది. గత ఏడాది కరోనా సంక్షోభం తలెత్తాక..ఈ అంశం చర్చనీయాంశమైంది. రిజిస్ట్రేషన్, గుర్తింపు కార్డులు లేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందటం లేదని కేంద్రంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్, జాతీయ కుటుంబ ప్రయోజనం, జననీ సురక్ష యోజన, జనశ్రీ బీమా యోజన, జాతీయ ఆరోగ్య బీమా..మొదలైన పథకాల ప్రయోజనం క్షేత్రస్థాయిలో అసంఘటిత కార్మికులకు అందటం లేదని సుప్రీం పలుమార్లు గుర్తుచేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టకపోవటం వల్లే ఇదంతా..అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించినప్పుడల్లా..రిజిస్ట్రేషన్ కోసం వెబ్ పోర్టల్‌ను ప్రకటిస్తూ కేంద్రం హడావిడి చేస్తోంది. కొద్దిరోజులు పోయాక..ఎవరికీ చెప్పాపెట్టకుండా వెబ్ పోర్టల్‌ను మూసేసింది. దీనిపై అటు ప్రతిపక్షాలు, ఇటు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చట్టం 2008లో వచ్చినా..
అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ...కేంద్ర కార్మిక శాఖ 2008లో 'అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్'ను తీసుకొచ్చింది. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా అమలుజేయాల్సిందే. అయితే కార్మికుల రిజిస్ట్రేషన్ కోసం 16 అక్టోబరు 2014లో మోడీ సర్కార్ 'శ్రమయేవ్ జయతే' అనే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. 'శ్రమ సువిధా పోర్టల్'ను ప్రారంభించింది. రెండు..మూడు వేలమంది కార్మికుల వివరాల్ని రిజిస్ట్రేషన్ చేసి..వెబ్ పోర్టల్‌ను కేంద్రం మూసేసింది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎందుకు ఆగింది?అనేదానిపై కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కరోనా సంక్షోభం తర్వాత అసంఘటిత కార్మికుల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశాలు కూడా జారీచేసింది. ఇక తప్పదన్నట్టుగా కేంద్రం మరో వెబ్‌పోర్టల్‌ను తెరిచింది. ఈ ఏడాది ఆగస్టు 26న 'యూనిఫైడ్ శ్రమ్ సువిధా పోర్టల్'ను ప్రారంభించింది. కేవలం పేరు మార్చి వెబ్‌పోర్టల్‌ను తెరిచారని, కార్మికులకు సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందించాలన్న ఆకాంక్ష కేంద్రంలోని పాలకులకు లేదని విమర్శలు వెల్లువెత్తాయి. పాత వెబ్ పోర్టల్‌లాగే..కొత్త వెబ్‌పోర్టల్‌ను చెప్పాపెట్టకుండా మూసేస్తారని విమర్శలున్నాయి.
ఏండ్లు గడుస్తున్నా..అంతే
రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని 24 మార్చి 2017లో సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించింది. అలాగే కార్మికుల కోసం 'జాతీయ సామాజిక భద్రతా బోర్డు'ను తీసుకురావాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖను 28 జనవరి 2020లో సుప్రీం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకురావటం కోసం 6నెలల సమయం పడుతుందని కేంద్రం సమాధానమిచ్చింది. ఏడాదిన్నర దాటిపోయినా..ఇప్పటికీ ఆ సాఫ్ట్వేర్ రూపకల్పన పూర్తికాలేదు.
ఎన్నిమార్లు చెప్పినా అంతే..
కరోనా సంక్షోభంలో చిక్కుకున్న కార్మికుల విషయాన్ని గత ఏడాది సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ జరిపింది. 2008నాటి చట్టం అమలుకావటం లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో తీర్పు చెబుతూ..2021 జులై 31నాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించాలని సుప్రీం డెడ్‌లైన్ విధించింది. కానీ కేంద్రం తీరిగ్గా..ఈ ఏడాది 26 ఆగస్టున ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇన్ని మార్లు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించినా కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలతోగానీ, కార్మిక సంఘాలతోగానీ సంప్రదింపులు, చర్చలు జరపటం లేదు.