Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్గదర్శకాలిచ్చేలోపు మూడోవేవ్ కూడా ముగుస్తుందేమో..!
- కరోనామృతుల పరిహారంపై సుప్రీం కోర్టు
- 11లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించడంలో కేంద్రం వైఖరి పట్ల అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. ఆదేశాలు ఇచ్చినప్పటికీ పరిహారం, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్గదర్శకాలు రూపొందించే నాటికి మూడో వేవ్ కూడా ముగుస్తుందేమోననే వ్యాఖ్యానించింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన రెండు వేరువేరు పిటిషన్లను శుక్రవారం జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మరణాలకు సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రాల జారీ కోసం మార్గదర్శకాలను రూపొందించాలని చాలా రోజుల కిందటే ఆదేశాలు ఇచ్చామనీ, వాటిని ఇప్పటికే ఒకసారి పొడిగించామని పేర్కొంది. కరోనాతో మరణించిన బాధిత కుటుం బాలకు పరిహారం అందించాలని జూన్ 30న ఇచ్చిన ఆదేశాలనూ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. అయితే, ఆ గడువు సెప్టెంబర్8తో ముగియనున్న నేపథ్యంలో ఆ సమయంలోగా పరిహారం చెల్లింపుపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని ధర్మాసనం పేర్కొంది. వీటికి సంబంధించి 11లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్ర తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ఆదేశాలన్నీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది గౌరవ్ బన్సాల్ సుప్రీం కోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని అన్నారు.