Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవాద వృత్తి కార్పొరేటీకరణతో ప్రజలు కోర్టులను ఆశ్రయించలేరు
- జాతీయ న్యాయ మౌలిక సదుపాయాల కమిషన్ అవసరం
- పేదలు, వెనుకబడినవర్గాలకు న్యాయ సహాయం చేయండి
- మహిళలు, రైతులు, కార్మికుల చట్టపరమైన హక్కులకు అండగా ఉండండి
- సన్మానసభలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని ప్రేరేపిత, దుర్మార్గమైన దాడుల నుంచి పరిక్షించాలని యువ న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పిలుపునిచ్చారు. దేశంలో న్యాయవాది వృత్తి కార్పొరేటీకరణ అయితే ప్రజలు కోర్టులను ఆశ్రయించలేరని తెలిపారు. సుప్రీంకోర్టులో కేవలం 11శాతమే మహిళ ప్రాతినిధ్యం ఉందనీ, దాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులు పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, వెనుకబడిన వర్గాలకు న్యాయ సహాయం చేయాలని సూచించారు. శనివారం నాడిక్కడ రౌస్ అవెన్యూ ఇనిస్టిట్యూషనల్ ఏరియాలో కార్యాలయంలో జస్టిస్ ఎన్వి రమణను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఘనంగా సత్కరించింది. బీసీఐ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ ప్రతినిధులు, న్యాయశాఖ మంత్రి కలిసి జస్టిస్ ఎన్వి రమణను పూలమాలలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖర్చులు, విచారణలో జాప్యమే న్యాయవ్యవస్థకు పెద్ద సవాల్ అన్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 'కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కొన్ని కోర్టుల్లో మహిళలకు సరైన వసతులు లేవు. దేశవ్యాప్తంగా సౌకర్యాల లేమిపై సమాచార సేకరణలో ఉన్నా. మరో వారం రోజుల్లో సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తా. ఈ నివేదిక ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటాం.సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నాం.వేర్వేరు హైకోర్టుల్లో ఖాళీల భర్తీకి పేర్లు సిఫార్సు చేశాం.ఖాళీల భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నా.న్యాయశాఖ మంత్రి చొరవ తీసుకుంటారని భావిస్తున్నా'' అన్నారు.
న్యాయవాది వత్తి కార్పొరేటీకరణతో చేటు
న్యాయవాద వత్తి కార్పొరేటీకరణ జరుగుతుందనీ, ఇది ఆందోళనకరమని అన్నారు.సాధారణ ప్రజలు ఫీజులు చెల్లించలేరనీ, లక్షలాది మంది ప్రజలు న్యాయంకోసం కోర్టులను ఆశ్రయించలేరని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. పేదలు, మహిళలు, రైతులు, కార్మికులు, వెనుకబడిన వారి చట్టపరమైన హక్కులను వినియోగించు కోవడానికి సహా యం చేయాలనీ,సాధ్యమైనప్పుడల్లా ఉచిత న్యాయ సహా యాన్ని అందించాలనీ,హక్కుల గురించి ప్రజలకు అవగా హన కల్పించాలని సూచించారు.న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల లోపం,న్యాయమూర్తులు, సిబ్బంది కొరత ను ఎదుర్కొంటోందని తెలిపారు. దేశానికి జాతీయన్యాయ మౌలిక సదుపాయాల కమిషన్ అవసరమని పేర్కొన్నారు.
కేవలం 11 శాతమే మహిళ ప్రాతినిధ్యం
ఈ వత్తిలో మహిళ న్యాయవాదులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య ఇంకా తక్కువగానే ఉందని అన్నారు. చాలా కొద్ది మంది మహిళలు మాత్రమే అగ్రస్థానంలో ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత ఎవరైనా అన్ని స్థాయిల్లోనూ 50 శాతం మహిళా ప్రాతినిధ్యాన్ని ఆశిస్తారని, అయితే తాము సుప్రీంకోర్టులో అతికష్టమ్మీద కేవలం 11శాతం మాత్రమే సాధించగ లిగామని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. రిజర్వేషన్ విధానం కారణంగా కొన్ని రాష్ట్రాలు అధిక ప్రాతినిధ్యాన్ని ఉండొచ్చనీ, కానీ న్యాయవాద వత్తి ఇప్పటికీ మహిళలను స్వాగతించాల్సి ఉందని అన్నారు. తాను హైకోర్టులో పనిచేసే రోజుల్లో మహిళలకు కనీసం మరుగుదొడ్లు ఉండేవి కావని, తాను న్యాయమూర్తి అయ్యాక ఆ మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.న్యాయ విద్య అనేది ధనవంతుల వృత్తి అనే భావన ప్రజల్లో నెలకొందనీ, ఆయా వర్గాలకు మాత్రమే ఈ వృత్తి పరిమితం అయిందని జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి
'ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత లాయర్లపై ఉంది. న్యాయవాదులు నైతిక విలువలతో పని చేయాలి. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని బాధ్యతలు నిర్వర్తించాలి. న్యాయ వ్యవస్థపైనా కరోనా మహమ్మారి ప్రభావం చూపింది. అనేకమంది న్యాయవాదులు కోవిడ్‌తో మరణించారు. కోవిడ్ వల్ల వర్చువల్‌గా విచారణలు చేపట్టాం. ఈ విధానంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇంటర్నెట్ సమస్యలు అధికంగా ఉన్నాయి. సమస్య పరిష్కారానికి న్యాయశాఖ చొరవ కోరుతున్నా. ఇంటర్నెట్ సంస్థలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నా' అని తెలిపారు.
న్యాయం ఆలస్యమైతే...నిరాకరించడమే : కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి
న్యాయం ఆలస్యమైతే, న్యాయం నిరాకరించినట్లేనని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యాయ వ్యవస్థ సామాన్యులకు ప్రాధన్యాత ఇవ్వాలని సూచించారు. దేశంలో దిగువ కోర్టుల్లో సామాన్యులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతోందని, అలాంటి వారికి సత్వర న్యాయం జరిగేలా దృష్టి పెట్టాలని సీజేఐని కోరారు. క్లిష్టమైన సమయంలోనూ సుప్రీంకోర్టు అనేక కేసుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుందని అన్నారు. న్యాయ వ్యవస్థకు జస్టిస్ ఎన్వి రమణ కొత్త ఉషోదయాన్ని తెచ్చారని కొనియాడారు. జస్టిస్ ఎన్వి రమణ గొప్ప న్యాయమూర్తే కాక.. ఉన్నత విలువలు కలిగిన మానవతా వాది కూడా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హృషికేష్ రారు, జస్టిస్ అబ్దుల్ నజీర్, నూతన న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సిటి రవి కుమార్, జస్టిస్ పిఎస్ నరసింహా, జస్టిస్ సుందరేశ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా, వైస్ చైర్మన్ ప్రభాకరన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బార్ కౌన్సిల్స్ అసోసియేషన్ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.