Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టులో జి7 దేశాల కంటే ఎక్కువ డోసుల పంపిణీ
న్యూఢిల్లీ : కోవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పొంది. దేశంలో ఆగస్టులో జి7 దేశాలన్నీ కలిపి ఇచ్చిన డోసులకంటే ఎక్కువ డోసులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఆగస్టులో 180 మిలియన్లకు పైగా డోసులు వేసినట్లు మైగవ్ ఇండియా ట్విట్టర్లో తెలిపింది. ఈ నెలలో జి7 దేశాలు (కెనడా, ఇంగ్లండ్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్) అన్నీ కలిపి ఇచ్చిన డోసుల సంఖ్య కంటే ఇది అధికమని పేర్కొంది. ఆగస్టులో ఈ దేశాలు 10.1 కోట్ల డోసులు మాత్రమే ఇచ్చాయి. 'ఇది మరో విజయం. ఆగస్టులో 18 కోట్లకు పైగా డోసులు ఇవ్వడం ద్వారా, వ్యాక్సినేషన్లో ముందు వరుసలో నిలుస్తూ.. భారత్ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది' అని ట్వీట్ చేసింది. గత నెలలో రెండు సార్లు (27న, 31న) కోటికి పైగా డోసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం 62.25 లక్షల డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకూ మొత్తంగా 68 కోట్లకు పైగా డోసులు ఇచ్చారు. వ్యాక్సిన్లను ఇచ్చే ముందు వాటిని ధ్రువీకరించుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ రాసింది. ఆగేయాసియా, ఆఫ్రికాల్లో కోవిషీల్డ్ నకిలీలను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన నేపధ్యంలో కేంద్రం ఈ హెచ్చరిక చేసింది.