Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోజికోడ్‌లో బాలుడి మృతి మరో ఇద్దరిలో లక్షణాలు
- అప్రమత్తమైన అధికార యంత్రాంగం
కోజికోడ్ : కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం రేగింది. కోజికోడ్ జిల్లాకు చెందిన 12 ఏండ్ల బాలుడు ఈ వైరస్‌తో ఆదివారం ఉదయం ఒక ప్రయివేటు ఆస్పత్రిలో మరణించాడు. బాలుడితో కాంటాక్ట యిన ఇద్దరిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కోజికోడ్తోపాటు మలప్పురం, కన్నూర్ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. కోజికోడ్ జిల్లా చతమంగళం గ్రామంలోని బాధిత కుటుంబం ఇంటికి వెళ్లే మార్గాన్ని మూసేశారు. జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితులపై కోజికోడ్ కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ బాలుడి నుంచి తీసుకున్న మూడు నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నిపుణులు పరీక్షించి, బాలుడిలో నిఫా వైరస్ ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. బాధితుడితో ఇటీవల సన్నిహితంగా మెలిగిన 188 మందిని గుర్తించామని, వారిలో 20 మందిని అధికారులు హైరిస్క్ జాబితాలో ఉంచారని చెప్పారు. వారిలో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లోనూ నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వీరిలో ఒకరు ఒక ప్రయివేటు ఆస్పత్రికి చెందిన వారు కాగా, మరొకరు కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి చెందిన సిబ్బంది. హైరిస్క్ జాబితాలో ఉన్న 20 మందిని ఆరోగ్యశాఖ కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించి వైద్యుల పరిశీలనలో ఉంచింది. మిగతా వారిని హోంఐసోలేషన్లో ఉంచారని మంత్రి తెలిపారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లని ఆమె సూచించారు. పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం కోజికోడ్‌కు చేరుకుంది.తీవ్రమైన జ్వరంతో పాటు మెదడువాపుతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడిని కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం కోజికోడ్ పట్టణంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. అంతకుముందు మరో రెండు ఆసుపత్రుల్లోనూ చికిత్స తీసుకున్నాడు. 2018 జూన్‌లోనూ కోజికోడ్‌లోనే తొలిసారి నిఫా వైరస్ వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 17 మంది వైరస్‌తో చనిపోయినట్టు నిర్ధారణ కాగా, మరో ఏడు అనుమానిత మరణాలు నమోదయ్యాయి. మరో ఇద్దరు వైరస్ నుంచి కోలుకున్నారు. 2019లో మరోసారి ఒకరిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. అప్రమత్తమైన ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడింది.