Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ వ్యాఖ్యలు
శ్రీనగర్: ఇటీవల కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ (92) మృతదేహంపై పాక్ జాతీయ పతాకాన్ని కప్పడం, దేశ వ్యతిరేక నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో స్థానిక బుడ్గాం పోలీసులు పలువురిపై 'ఉపా' చట్టం కింద కేసు నమోదు చేశారు. దీన్ని మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. కేంద్రం తీరును విమర్శిస్తూ ఆదివారం ట్వీట్ చేశారు. 'కాశ్మీర్‌ను ఇప్పటికే బహిరంగ జైలుగా మార్చారు. ఇప్పుడు చనిపోయిన వారినీ విడిచిపెట్టలేదు. కోరుకున్నట్టుగా గిలానీకి తుది వీడ్కోలు పలికేందుకు, సంతాపం ప్రకటించేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతించలేదు. ఇప్పుడు ఉపా చట్టం కింద వారిపై కేసు నమోదు చేయడమనేది.. కేంద్ర ప్రభుత్వ నిర్దయను చూపుతోంది. ఇదీ కొత్త భారతదేశపు సరికొత్త కాశ్మీర్' అని అందులో పేర్కొన్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గిలానీ బుధవారం రాత్రి శ్రీనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలియగానే పోలీసులు కాశ్మీర్ లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. మొబైల్ సేవలను నిలిపివేశారు. భారీ భద్రత నడుమ ఇస్లాం మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.