Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్యప్రాణుల ఆవాసాల్లో నిర్మాణాలకు కేంద్రం ఓకే!
- స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనపై జంతు ప్రేమికులు, పర్యావరణ నిపుణులు ఆగ్రహం
న్యూఢిల్లీ : అడవులు, వన్యప్రాణుల ఆవాసాల్ని పరిరక్షించుకోవాల్సింది పోయి..వాటిని దెబ్బతీసే విధంగా కేంద్రం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అభయారణ్యం, జాతీయ పార్కులు, వన్యప్రాణులు నివసించే ప్రాంతాల్లో ఏదైనా నిర్మాణరంగ పనులు చోటుచేసుకుంటే...ఇందుకుగాను కొంతమొత్తం సర్‌ఛార్జీ వసూలుచేస్తే సరిపోతుందని మోడీ సర్కార్ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. 'వన్యప్రాణుల జాతీయబోర్డు'కు చెందిన స్టాండింగ్ కమిటీ 'సర్‌చార్జీ' అంశాన్ని ప్రతిపాదించింది. అభయారణ్యాలు, జాతీయ పార్కులు..వంటి వన్యప్రాణుల ఆవాసాల్లో జరిగే నిర్మాణాల వల్ల అక్కడి వాతావరణానికి, వన్యప్రాణులకు నష్టం వాటిల్లితే, దీని తీవ్రతను తగ్గించడానికి సంబంధిత నిర్మాణరంగ కంపెనీపై 2శాతం సర్‌చార్జీ విధించాలని స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. అత్యంత వివాదాస్పదమైన ఈ ప్రతిపాదనపై సామాజిక కార్యకర్తలు, జంతు ప్రేమికులు, పర్యావరణ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ముంబయికి చెందిన సామాజిక కార్యకర్త దేబి గోయెంకా మాట్లాడుతూ..''ఎంతో విలువైన వన్యప్రాణుల ఆవాసం దెబ్బతింటే..దానికి సర్‌చార్జీ వసూలు చేయాలనటం పూర్తిగా తప్పుడు విధానం. వన్యప్రాణులు నివసించే చోట..నిర్మాణరంగ కార్యకలాపాలకు అవకాశం ఇస్తే..జరిగే నష్టం పూడ్చలేనిది. దీనికి ప్రత్యామ్నాయం లేదు. మొత్తం అక్కడి జీవావరణమే అల్లకల్లోలం అవుతుంది'' అని చెప్పారు. వన్యప్రాణుల జాతీయ బోర్డు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై పర్యావరణ నిపుణులు సామాజిక మాధ్యమంలో తమ ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీ నిర్ణయం సరైంది కాదని విమర్శించారు.