Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. విజయనగరంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకూ కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. రహదారులు జలాశయాలను తలపించాయి. విశాఖ నగరంలో భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గాఢాంధకారం నెలకొంది. పలు కాలనీలు నీట మునగడంతో రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, మామిడికుదురు, అల్లవరం, రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొత్తపేట, ముమ్మిడివరం, రావులపాలెంలో నారుమళ్లు నీట మునిగాయి. రాజవొమ్మంగి, మారేడుమిల్లి, చింతూరులో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం పట్టణంలో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలైన రాజీవ్‌నగర్ కాలనీ, లంకాపట్నం, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, వైఎస్ నగర్, గూడ్స్‌షెడ్, గాజులరేగ, పూల్‌బాగ్ కాలనీ ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలకు చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.శ్రీకాకుళం జిల్లాలోని భామిని, వీరఘట్టం, బూర్జ, పాలకొండ, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, పాతపట్నం తదితర మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.విశాఖ జిల్లాలోని జి.మాడుగుల, పెదబయలు, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, భీమునిపట్నం, సబ్బవరం మండలాల్లో వర్షం కురిసింది. దీంతో ఏజెన్సీ మండలాల్లోని కొండ వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి.
24 గంటల్లో భారీ వర్షాలు
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాగల 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు సహా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.