Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహారా ప్రాంత ఆఫ్రికా దేశాల్లోకన్నా భారత్ అధ్వానం..
- సామాజిక వివక్ష, వెనుకబాటుతనమే ప్రధాన కారణం : తాజా అధ్యయనం
న్యూఢిల్లీ : ప్రపంచంలో పోషకాహార సమస్యతో బాధపడుతున్న పిల్లల్లో (ఐదేండ్లలోపు) మూడోవంతు భారత్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. మనదేశంలో సామాజిక వివక్ష, వెనుకబాటుతనం, అణచివేత..మొదలైనవి బలంగా వేళ్లూనుకుని ఉండటం పోషకాహార సమస్యకు కారణమని తాజా అధ్యయనం ఒకటి గణాంకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం కుటుంబాలకు చెందిన పిల్లల్లో పోషకాహర లోపం ఎక్కువగా కనబడుతోందని ఈ అధ్యయనం తేల్చింది. ఐదేండ్లలోపు పిల్లల్లో పోషకాహార సమస్య ఉంటే...అది రేపటి సమాజంపై సామాజికంగా, ఆర్థికంగా ప్రభావం చూపుతుంది. ఎత్తుకు తగిన బరువు లేకున్నా, వయస్సుకు తగిన శారీరక ఎదుగుదల లేకున్నా..దానిని పోషకాహార లోపంగానే పరిగణించాలి. ఈ అంశంలో సబ్ సహారా ఆఫ్రికా దేశాలతో పోల్చితే భారత్ ఆందోళనకర స్థితిలో ఉందని 'అశోకా యూనివర్సిటీ'కి చెందిన అశ్వినీ దేశ్పాండే, 'హెడిల్బర్గ్ వర్సిటీ'కి చెందిన రాజేశ్ రామచంద్రన్ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. 'ద మిస్సింగ్ పీస్ ఆఫ్ ద పజిల్ : క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ స్టంటింగ్' అనే పేరుతో నివేదిక విడుదల చేశారు. నివేదికలో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. పోషకాహార సమస్య (5ఏండ్ల లోపు పిల్లల్లో) సబ్ సహారాలోని 30 ఆఫ్రికా దేశాల్లో కన్నా ఎక్కువగా భారత్లో ఉంది. సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో సగటు పోషకాహార లోపం 31శాతం ఉంటే, భారత్లోని ఎస్సీ పిల్లల్లో-40శాతం, ఎస్టీల్లో-36శాతం, ముస్లింలో-35శాతం ఉందని నివేదిక పేర్కొంది. వయస్సుకు తగిన ఎత్తు పెరగక పోవటమనే సమస్య ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లింలలో రెండు మూడు రేట్లు అధికంగా ఉంది. ఈ కుటుంబాల్లోని పిల్లల్లో సమస్య ఎక్కువగా ఉండటానికి గల కారణాలపై పరిశోధకులు అన్వేషించారు. వివిధ సంస్థల అభివృద్ధి గణాంకాలను పరిగణలోకి తీసుకున్నారు.
సమస్యకు కారణాలేంటి?
భారత్ విషయానికొస్తే ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాల్లోని కుటుంబాల్లోనే పోషకాహార సమస్య ఎక్కువగా కనబడుతోంది. మనదేశంలో వివిధ సామాజిక వర్గాల మధ్య అంతరాలు, అసమానతలు ప్రధాన కారణమని, సామాజిక వివక్ష..ముఖ్యంగా అంటరానితనం తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశోధకులు నిర్ధారించారు. ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే గణాంకాల్ని విశ్లేషించగా, ఏ ఏ జిల్లాల్లో అంటరానితనం ఉందని బాధితులు చెప్పారో..అక్కడ పోషకాహార సమస్య ఎక్కువగా నమోదైందని పరిశోధకులు చెబుతున్నారు.