Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూనె ధరలపై వాతావరణం, ఎలుకల ప్రభావం
- ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గరిష్ట స్థాయికి నూనె ధరలు
- ప్రతికూల ప్రభావంతో అంతర్జాతీయంగా ఐదేండ్ల కనిష్టానికి నిల్వలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని.. అనేక రంగాలను సంక్షోభంలోకి నెట్టింది. దీని ప్రభావం కారణంగా మరీ ముఖ్యంగా వంట నూనెల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. తాజాగా కరోనా లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తూ పలు దేశాలు తిరిగి సాధారణ పరిస్థితులకు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే భారీగా ఉన్న వంట నూనెల ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం నూనెల ఉత్పత్తికి ప్రతికూల ప్రభావం ఉండటమే. కరోనా కారణంగా ఇందులో పనిచేసే కార్మికులు, నిర్వహకులను తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరీ ముఖ్యంగా వంటనూనెల ఉత్పత్తి తోటలలో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే, ప్రతికూల వాతావరణం, ఆయా నూనె ఉత్పత్తుల తోటలను చీడపీడలు, ఎలుకలు ఆకర్షించడం కారణంగా గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు కనిష్ట స్థాయికి వంట నూనెల ఉత్పత్తి పడిపోయింది.మలేషియా.. ప్రపంచంలో రెండో అతిపెద్ద పామాయిల్ ఉత్పిత్తిదారు. అయితే, ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం, తుఫానులను ఎదుర్కొంటోంది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంట నూనె నిల్వలను ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగజార్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నది. దీని కారణంగా గ్లోబల్ ఫుడ్ ధరలు ఈ సంవత్సరం 10 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ధర సూచిక గత వేసవి నుండి మూడవ వంతు కంటే ఎక్కువ పెరిగింది. ఎఫ్ఏవో గ్లోబల్ ఎడిబుల్ ఆయిల్స్ ఇండెక్స్ గత జూన్ నుండి 91 శాతం పెరిగింది. అయితే, కోవిడ్ -19 అన్‌లాక్ తర్వాత ఆర్థిక వ్యవస్థలు తిరిగి తెరుచుకోవడంతో ఆహారం, వంట నూనెల ఇంధన వినియోగాన్ని పెంచడం వల్ల ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలో అత్యధికం వినియోగించే వంటనూనెలు ఫామ్ ఆయిల్, సోయాబిన్, కనోలా, (రేప్‌సీడ్), పొద్దుతిరుగుడు ఉత్పత్తి సైతం దశాబ్దంలో కనిష్టానికి పడిపోయింది. దీనికితోడూ ఉత్పత్తిదారులు కార్మికుల కొరత, వేడిగాలులు, ప్రతికూల ప్రభావం, క్రిమికీటకాలు వంటి అనేక అడ్డంకులతో పోరాడుతున్నారు.మలేషియా ప్రపంచ పామాయిల్ ఎగుమతుల్లో దాదాపు 33 శాతం వాటాను కలిగివుంది. అయితే, జనవరి-జూన్‌లో పామ్ ఫ్రూట్ బంచ్‌ల సగటు దిగుబడి ఒక సంవత్సరం క్రితం 7.85 నుండి హెక్టారుకు 7.15 టన్నులకు పడిపోయింది. మలేషియా పామ్ ఆయిల్ బోర్డ్ డేటా గతేడాది ఇదే కాలంలో 1.56 టన్నుల నుండి సగటున ముడి పామాయిల్ దిగుబడి హెక్టారుకు 1.41 టన్నులకు పడిపోయిందని చూపిస్తోంది. ఇండోనేషియా, దక్షిణ ఆసియా నుండి వలస కార్మికుల సాధారణ సరఫరాను ప్రభుత్వ కరోనావైరస్ ఆంక్షలు నిలిపివేసిన తర్వాత అనేక తోటల్లో కార్మికుల కొరతతో ఉన్నాయి. కోతను 14 రోజుల నుంచి 40 రోజులకు పొడిగించాల్సి వచ్చింది. దీంతో పండ్ల నాణ్యత దెబ్బతినే ప్రమాదముందని ఆయా వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆయా కాంపెనీల ఉత్పత్తి ఏకంగా 50 శాతం వరకు తగ్గిపోయాయి. కార్మికుల కొరత.. ఉన్నవారిని నిలుపుకోవడానికి వేతనాలు సైతం పెంచాల్సి వచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి తోడు మానవ శక్తికంటే ఎలుకలు, చిమ్మటలు, కీటకాలు, వివిధ తెగుళ్ల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఇక కెనడాలో వేడిగాలుల కారణంగా అక్కడి కనోలాను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో అక్కడి వ్యవసాయ విభాగం ఉత్పత్తి అంచనాలను సైతం భారీగా తగ్గించింది. సోయాబీన్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. అయితే, పొద్దుతిరుగుడు ఉత్పత్తిని ఉక్రెయిన్ 18 శాతం పెంచుతుందని భావిస్తున్నారు. 5.38 మిలియన్ నుంచి 6.35 మిలియన్ టన్నులకు పెరుగుతాయిని అంచనా వేస్తున్నారు. వంట నూనెల రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో చాలా దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.