Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయే 50ఏండ్లలో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
- కీలకమైన ఐదు రంగాలపై దెబ్బ : 'డెలాయిటీ' నివేదిక
- పునరుత్పాదక శక్తి వనరులపై దృష్టిసారించాలి..
న్యూఢిల్లీ : కార్బన్ ఉద్గారాలకు అడ్డుకట్ట పడకపోతే..భూతాపం పెరిగిపోయి అనూహ్యమైన వాతావరణ మార్పులకు దారితీస్తుందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్రమైన ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వస్తుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. భారత్ విషయానికొస్తే.. 2050నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు సుమారుగా 6 ట్రిలియన్ డాలర్ల(రూ.437లక్షల కోట్లు) నష్టం వాటిల్లుతుందని 'డెలాయిటీ'(ఆడిటింగ్, పన్ను సేవలు, కన్సల్టింగ్ సంస్థ) విడుదల చేసిన నివేదికలో వాతావరణ నిపుణులు అంచనావేశారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించే చర్యలు పకడ్బంధీగా కొనసాగితే..2070నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 11 ట్రిలియన్ డాలర్లు (ఒక ట్రిలియన్ డాలర్ రూ.72లక్షల కోట్లకు సమానం) లాభపడుతుందని నివేదిక పేర్కొంది. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు అనూహ్యంగా ఉన్నాయి. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు, వెంటనే తీవ్రమైన వేడి వాతావరణం, అడవుల దహనం..వంటివి చోటుచేసుకోవటం స్పష్టంగా కనపడుతున్నాయి. మానవాళి ముందుగా ఊహించలేని వాతావరణ పరిస్థితులు మరిన్ని ఏర్పడతాయి. ఇలాంటివాటితో భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఆర్థిక నష్టాలు ఏర్పడే అవకాశముంది. పర్యావరణ మార్పులు రాబోయే 50 ఏండ్లలో..ప్రధానమైన ఐదు రంగాలపై ప్రభావం చూపుతుంది. సేవారంగం, తయారీ, రిటైల్, టూరిజం, నిర్మాణరంగం, రవాణా..ఇవి భారత జీడీపీలో 80శాతం వాటాని కలిగివున్నాయి. పర్యావరణ మార్పుల నేపథ్యంలో ఈ ఐదు రంగాలు దెబ్బతిని..భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే అవకాశముంది. అలాగే వ్యవసాయ దిగుబడి తగ్గే ప్రమాదముంది. దేశ జీడీపీలో 16 శాతం వాటా కలిగిన వ్యవసాయరంగంలో ఆదాయాలు పడిపోవటం జరగవచ్చు.
వివిధ రంగాలపై పర్యావరణ మార్పుల ప్రభావం కారణంగా, 2050 నుంచి 2100 మధ్యకాలంలో భారత ఆర్థిక వ్యవస్థకు సుమారుగా 35 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లవచ్చునని నిపుణులు అంచనావేస్తున్నారు. దీనిని నివారించాలంటే ఇప్పట్నుంచే భారత్ కొన్ని చర్చలు తీసుకోవాల్సి వుంటుందని నివేదిక సూచించింది. కార్బన్ ఉద్గారాల్ని తగ్గించే సాంకేతిక అభివృద్ధి అంశాలపై పెట్టుబడులు పెరగాలి. పునరుత్పాదక శక్తి వనరులపై పెట్టుబడులు పెరగాలని, భారత్లో ఈ రంగంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయని నివేదిక తెలిపింది. పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం, 2005నాటి కార్బన్ ఉద్గారాల్లో 35శాతం తగ్గుదలను భారత్ 2030నాటికి సాధించాల్సి వుంది.