Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీపై రూ.200 వరకూ పెంపు
- ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం కారణమంటున్న వ్యాపారులు
- మరింత పెరిగే అవకాశం
రాజమహేంద్రవరం : డ్రై ఫ్రూట్స్ ధరలు భారీగా పెరిగాయి. కరోనా విజంభణ నేపథ్యంలో రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఆహారంతోపాటు డ్రై ఫ్రూట్స్ తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన సంక్షోభం ప్రభావం డ్రై ఫ్రూట్స్ దిగుమతులపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు. అక్కడి నుంచి దిగుమతులు నిల్చిపోవడం, ఇక్కడ డిమాండ్ తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయని వారంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కార్పొరేట్ మాల్స్, సూపర్ బజార్లు, పెద్ద షాపింగ్ మాల్స్‌లు, కొన్ని రకాల స్వీట్ మార్టుల్లో మాత్రమే గతంలో డ్రైఫ్రూట్స్ లభించేవి. ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రత్యేక షాపులు ఏర్పాటు చేశారు.కొన్ని పచారీ దుకాణాల్లో సైతం ప్రస్తుతం ఇవి లభిస్తున్నాయి. డ్రై ఫ్రూట్స్‌ను సరఫరా చేసే హోల్‌సేల్, రిటైల్ షాపులు జిల్లాలో 500 వరకూ ఉన్నాయి. వీటిద్వారా ప్రతి నెలా కోట్ల రూపాయల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. డ్రైఫ్రూట్‌లో బాదం, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, పిస్తా, అంజీరలకు ఎక్కువగా డిమాండ్ ఉంది.
ప్రధానంగా బాదం అత్యధికంగా అమెరికా, ఆఫ్ఘానిస్తాన్ల నుంచి దిగుమతి అవుతుంది. ఖర్జూరం అరబ్ దేశాల నుంచి వస్తుంది. ఇటీవల అమెరికాలో వచ్చిన తుపాన్లకు కాలిఫోర్నియో ప్రాంతంలోని బాదం పంటకు భారీ నష్టం కలిగింది. ఇక్కడి నుంచే ఇండియాకు బాదం ఎక్కువగా దిగుమతి అవుతుంది. అమెరికా నుంచి బాదం దిగుమతి లేకపోవడంతో ఆప్ఘనిస్తాన్ నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అంజీర, పిస్తా కూడా ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ నుంచే వస్తుంది. అప్ఘనిస్తాన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం కారణంగా తాలిబన్లు ఇండియాకు ఎగుమతులను పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. దీంతో, ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లలో ఉన్న స్టాక్ మాత్రమే వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. ధరలను పెంచేశారు. నెల క్రితం, ప్రస్తుత ధరలు కేజీకి రూ.100 నుంచి రూ.200 పెరిగాయి.
రకం నెల క్రితం ధర ప్రస్తుత ధర
పిస్తా రూ.800 రూ.1000
బాదం రూ.600 రూ. 820
ఎండుద్రాక్ష రూ.500 రూ. 600
కిస్మిస్ రూ.300 రూ. 330
అంజీర రూ.800 రూ. 950