Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదీ ఆలస్యంగానే..!
- ఉపాధి హామీ కార్మికుల వెతలు
న్యూఢిల్లీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఏ) కింద చెల్లింపులు కార్మికులకు సమస్యగా మారాయి. ఈ పథకం కింద వారికి చేసే చెల్లింపులు చాలా తక్కువగా ఉన్నాయి. వారు పొందే ఈ కొద్దిపాటి చెల్లింపులు కూడా వారికి సమయానికి అందడం లేదు. ఆలస్యంగా జరుగుతున్న చెల్లింపులు కూడా వారిని ఇబ్బంల్లోకి నెట్టేస్తున్నాయి. దీనిపై 'ఉపాధి హామీ' కింద ఆధారపడే గ్రామీణ ప్రజలు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు వచ్చే చెల్లింపులను పెంచడంతో పాటు వాటిని సమయానికి తమకు అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.కాగా, కార్మికులకు వేతనాలు చెల్లింపుల విషయంలో ఇలాంటి సమస్య తలెత్తడానికి కేంద్రం వద్ద జాప్యంతో పాటు స్థానికంగా జరిగే అవకతవకలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి హామీ కింద కార్మికులకు అందే చెల్లింపులను కేంద్రం రెండు స్టేజీలుగా విభజించింది. వీటిలో ఒకటి స్థానికం స్థాయి కాగా, రెండోది కేంద్రం నుంచి కార్మికుల ఖాతాల్లోకి జమకావడం. అయితే స్థానిక స్థాయిలో బాధ్యతంతా స్థానిక యంత్రాంగాలదే. ఈ స్టేజీలో కార్మికుల రోజువారీ హజరును మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) లో నమోదు చేయాల్సినవసరం ఉంటుంది. వివిధ బ్యాచ్లలో చెల్లింపులను ఆలస్యం చేయడానికి ఇటువంటి అనేక వేతన జాబితాలు వేర్వేరు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లుగా (ఎఫ్టీఓ) చేర్చబడ్డాయి. అయితే, మొదటి దశ, రెండో దశలను 15 రోజుల్లో అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో చట్ట ప్రకారం.. కార్మికుడు ఈ 15 రోజుల్లోపు చెల్లింపును పొందాలి. అయితే, వాస్తవానికి మాత్రం చెల్లింపులు సకాలంలో జరగడంలేదనీ, ఇందులో తప్పుదోవ పట్టించ అనేక చర్యలు ఉన్నాయని ఉపాధి కార్మికులు ఆరోపించారు.స్థానిక యంత్రాంగాల నుంచే కాకుండా కేంద్రం చర్యలతోనూ ఈ చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. గతనెలలో 40 శాతం చెల్లింపులు కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్నాయని ఒక అధికారిక నివేదికను ఉటంకిస్తూ వారు చెప్పారు. అయితే, సంబంధిత వెబ్సైట్లో మాత్రం 99 శాతం చెల్లింపులు సకాలంలో జరిగాయని కనిపించడం తప్పుదోవ పట్టించడమేనని తెలిపారు. ఎన్ఆర్ఈజీఏ వెబ్సైట్లో చెల్లింపులలో పూర్తిస్థాయి జాప్యాన్ని చూపించాలనీ, దానికి అనుగుణంగా కార్మికులకు పరిహారం చెల్లించాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని వారు గుర్తు చేశారు. అయితే, కార్మికులకు చెల్లింపుల విషయంలో ఇవేమీ జరగడం లేదనీ, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని నిపుణులు చెప్పారు.ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వ అస్పష్ట విధానాలు కార్మికులకు శాపంగా మారాయి. 2016-17లో 17 శాతం, 2017-18లో 43 శాతం చెల్లింపుల మాత్రమే సక్రమంగా జరిగాయని 2018లో సుప్రీంకోర్టు ముందు కేంద్రం తెలియజేయడం గమనార్హం. అయితే, ఆధార్ ఆధారిత వ్యవస్థ ద్వారా చెల్లింపు సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామన్న కేంద్రం వాదన అబద్ధమని నిపుణులు వాదించారు. ఈ వ్యవస్థ ద్వారా కార్మికులు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని చెప్పారు. కార్మికులకు సకాలంలో చెల్లింపులను అందించడంలో అనేక సవాళ్లను సృష్టించిందని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా కార్మికులకు చెల్లింపులు, అవి సకాలంలో అందే విషయంలో కేంద్రం చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని నిపుణులు, ఉపాధి హామీ కార్మికులు తెలిపారు.