Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు గర్జన చారిత్రాత్మకం
- దేశాన్ని కాపాడటమే లక్ష్యం
- బీజేపీని గద్దెదించుతాం
- రైతు వ్యతిరేక బీజేపీకి ఓటెయ్యొద్దు
- మాది రైతు కులం, వ్యవసాయ మతం
- ప్రజల ఐక్యత వర్థిల్లాలి.. కంపెనీ రాజ్ నశించాలి : రైతు నేతలు
- నిండిన మైదానం.. బయటే ఉండి ప్రసంగాలు విన్న రైతులు
తమకు కులం,మతంలేదంటూ అన్నదాత పిడికిల బిగించి శంఖారావం పూరించాడు. దేశాన్ని కాపాడమే లక్ష్యంగా..బీజేపీని గద్దె దించుతామని ముక్తకంఠంతో శపథం చేశాడు. యోగిసర్కార్ ఎన్ని అడ్డంకులు కల్పించినా ముజఫర్‌నగర్‌లో ఎటుచూసినా కర్షక,కార్మిక,శ్రామిక జనంతో కిటకిటలాడింది. యూపీ ఎన్నికలకు ముందు నిర్వహించిన చారిత్రాత్మక గర్జనతో బీజేపీ నేతలకు కంటిమీద కునుకలేకుండా చేస్తున్నది.
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బీజేపీని గద్దెదించుతామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆధిత్య నాథ్ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఓటేయ వద్దని పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. కులం,మతం పేరుతో ప్రజలను చీల్చాలని బీజేపీ చూస్తున్నదనీ, దాని నుంచి విముక్తి అయి ప్రజలంతా ఐక్యంగా బీజేపీని గద్దెదించాలని శపథంచేశారు. రైతువ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధర కల్పించాలనీ, విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని దేశ రాజధాని డిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జీఐసీ మైదానంలో భారీ చారిత్రాత్మక కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. మిషన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కార్యక్రమం ప్రారంభంలో భాగంగా దేశవ్యాప్తంగా పది లక్షల మందితో చారిత్రాత్మక కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైతు సమీకరణగా ఇది చరిత్రలో నిలిచిపోయిందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పష్టం చేసింది. చారిత్రాత్మక రైతు గర్జన జరిగిన ఈ ప్రాంతం రైతులతో కిటకిటలాడింది. మతాలు, కులా లు, ప్రాంతాలు, భాషలను దాటి జనసంద్రంలా మారింది. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలకు బిగ్గరగా స్పష్టమైన సందేశాన్ని పంపించింది. కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్‌కి సమాజంలోని అన్ని వర్గాల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. ఈ కిసాన్ మహా పంచాయత్‌లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్, కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రైతులు పాల్గొ న్నారు. మహిళలు, యువత రైతులు పెద్ద సంఖ్యలో హాజర య్యారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, విద్యార్థు లు, యువత తదితర వర్గాల నుంచి లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఇది దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద రైతు ర్యాలీగా గుర్తింపు పొందింది. నగరానికి వెలుపలే వాహనాలు అన్ని నిలిపేసి, అక్కడ నుంచి ర్యాలీలు సభా ప్రాంగనానికి చేరు కున్నాయి. 20కిలోమీటర్ల మేర రైతుల ప్రవాహం కనిపించింది. దీంతో ముజఫర్‌నగర్ అంతా రైతులతో నిండిపోయింది. కిసాన్ మహా పంచాయత్ సభ ప్రాంగణం పూర్తిగా నిండిపోవడంతో చాలా మంది రైతులు వెలుపలే ఉండి, రైతు నేతల ప్రసంగాలు విన్నారు.
వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం కొనసాగించాలని తమ నిర్ణయాన్ని ఎస్కేఎం నేతలు పునరుద్ఘాటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి నిరసనలను కొనసాగించాలని రైతులు నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు వారు పాలక యోగి ఆధిత్య నాథ్ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. వారు తమ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని అన్నారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవి చూడా ల్సి ఉందని నేతలు స్పష్టం చేశారు. కిసాన్-మజ్దూర్ ఎజెండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతపరమైన, కులవాద రాజకీయాలపై విజయం సాధిస్తుందని నేతలంతా స్పష్టం చేశారు. భవిష్యత్తులో మత కలహాలు జరగడానికి రైతులు ఎన్నడూ అనుమతించరని ప్రకటించారు. కిసాన్ ఆందోళన్ ఎల్లప్పుడూ హిందూ-ముస్లిం ఐక్యతను బలోపేతం చేయడానికి నినాదాన్ని ఇస్తుందని తెలిపారు. తమది రైతు కులమనీ, వ్యవసాయమే మతమని స్పష్టం చేశారు.
2013లో ఇదే ముజఫర్‌నగర్‌లో బీజేపీ ప్రజలను విభజించిం దనీ, అయితే ఈ కిసాన్ మహా పంచాయత్ అటువంటి విద్వేష పూరిత రాజకీయాలను వ్యతిరేకిస్తూ ప్రజలను ఐక్యం చేసిందని తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతులకు ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎంతో ప్రేమను అందించారనీ, ఇది ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇకపై బీజేపీ దుశ్చర్య, జుమ్లాలను తిప్పికొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం విభజించు, పాలించు విధానంతో పాటు కుల, మతపరమైన విధానాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్నదనివిమర్శించారు.
యోగి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనీ, వాగ్దానం చేసిన వాటిలో 20 శాతం పంట కొనుగోళ్లు కూడా పూర్తి కాలేదని ఎస్కేఎం నేతలు పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వం 86 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందనీ, కానీ సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్టు అండ్ ప్రైస్ (సీఏసీపీ) 2017లో చెరకు ధర క్వింటాల్‌కు రూ.383 నిర్ణయించిందని, అయితే రైతులకు మాత్రం క్వింటాల్‌కు రూ.325 మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. ఇప్పటికే చెరకు రైతులకు రూ.8,700 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో 2016-17లో 72 లక్షల మంది రైతులకు పంట బీమా చెల్లించగా, 2019-20లో కేవలం 47 లక్షల మంది రైతులకు మాత్రమే చెల్లించారని తెలిపారు. అయితే ప్రయివేట్ పంటల బీమా కంపెనీలు మాత్రం రూ.2,508 కోట్ల లాభాలను ఆర్జించాయని ఎస్కేఎం నేతలు స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా చెరకు క్వింటాలుకు రూ.450 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాబోయే ఎస్కేఎం సమావేశంలో ఆందోళన ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
అనివార్య పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ 25న జరగాల్సిన భారత్ బంద్‌ను, సెప్టెంబర్ 27న నిర్వహిస్తామని, దీన్ని దేశవ్యాప్తంగా విజయవంతం చేయాలని ఎస్కేఎం నేతలు పిలుపు ఇచ్చారు.
పూర్వ కాలంలో గౌరవం కోసం యుద్ధాలు జరిగేవని, నేడు రైతులు, వ్యవసాయ కార్మికులు బీజేపీ కార్పొరేట్ రాజ్‌పై యుద్ధానికి పిలుపు ఇచ్చారని స్పష్టం చేశారు. ప్రజల ఐక్యత వర్థిల్లాలని, కంపెనీ రాజ్ నశించాలని గర్జించారు. ''కొద్ది మంది రైతులు మాత్రమే నిరసన తెలుపుతున్నారని వారు (కేంద్రం) చెప్పారు. ఎంత తక్కువ మంది నిరసన వ్యక్తం చేస్తున్నారో చూద్దాం. పార్లమెంటులో కూర్చున్న వారి చెవులకు అది వినిపించుకుందాం'' అని రైతు నేతలు ప్రకటించారు. ''ప్రభుత్వం అర్థం చేసుకుంటే మంచిది. దేశవ్యాప్తంగా ఇటువంటి సమావేశాలు జరుగుతాయి. దేశాన్ని విక్రయించకుండా కాపాడాలి. రైతులు, కార్మికులు, యువకులు జీవించడానికి అనుమతించాలి'' అని అన్నారు. అన్ని కులాలు, మతాలు, వర్గాల మద్దతుతో లక్షల మంది రైతులు ర్యాలీ చేసినప్పటికీ, మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు చట్టపరమైన హామీ ఇవ్వకపోతే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ సమస్యపై పోరాటానికి ఎస్కేఎం త్వరలోఒక ప్రణాళిక తయారు చేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రంలో యోగి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా.. ధైర్యంగా ఎదుర్కొన్న లక్షలాది మంది రైతులను ఎస్కేఎం అభినందించి, కృతజ్ఞతలు తెలిపింది. విజయం సాధించే వరకు దేశంలోని ప్రతి మూలకు రైతుల ఉద్యమ జ్యోతిని తీసుకెళ్లాలని పిలుపునిచ్చింది.
కిసాన్ మహా పంచాయత్‌లో ఎస్కేఎం నేతలు రాకేశ్ తికాయత్, నరేశ్ తికాయత్, హన్నన్ మొల్లా, ధర్మేంద్ర మాలిక్, రాజేష్ సింగ్ చౌహాన్, రాజ్వీర్ సింగ్ జడౌన్, అమృత కుందు, బల్బీర్ సింగ్ రాజేవాల్, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రన్, శివకుమార్ శర్మ కక్కజీ, యోగేంద్ర యాదవ్, యుద్ధవీర్ సింగ్, గుర్నామ్ సింగ్ చారుణి, మేధా పాట్కర్, బల్దేవ్ సింగ్ నిహల్‌గఢ్, రుల్డు సింగ్ మన్సా, కుల్వంత్ సింగ్ సంధు, మంజిత్ సింగ్ ధనేర్, హర్మీత్ సింగ్ కడియన్, మంజిత్ రారు, సురేష్ కోత్, రంజీత్ రాజు, తేజిందర్ సింగ్ విర్క్, సత్యవన్, సునీలం, ఆశిష్ మిట్టల్, డా. సత్నామ్ సింగ్ అజ్నాలా, సోనియా మాన్, జస్బీర్ కౌర్, జగ్మతి సాంగ్వాన్‌లతో పాటు అనేక ఖాప్ పంచాయత్ నేతలు ప్రసంగించారు. చౌదరి సోంవీర్ సింగ్, పంజాబ్ సింగర్ జాస్ బజ్వా, నటి సోనియా మన్న తదితరులు పాల్గొన్నారు.
సైడ్‌లైట్స్...
మహా పంచాయత్ జరిగే ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపివేత
రోడ్లు...ప్లైఓవర్లన్ని రైతులతో నిండిపోయాయి
వేలాది మంది రైతులు జాతీయ జెండాలు చేబూని ర్యాలీలో కదం తొక్కారు.
ప్రదర్శనల్లో వివిధ రైతు సంఘాల జెండాలుండటంతో హరివిల్లుగా ముజఫర్‌నగర్.
ఆహారం, మంచినీళ్లు తదితరు ఆహార పదార్థాలు అందజేసిన ముస్లింలు..
రైతులు ఆయా సంఘాల జెండాలు పట్టుకుని, వివిధ రంగు టోపీలు ధరించిన మహిళలు సహా బస్సులు, కార్లు, ట్రాక్టర్లలో ముజఫర్‌నగర్‌కు చేరిక.
మొబైల్ స్టాల్లతో సహా 5,000 కంటే ఎక్కువ 'లాంగర్లు' (ఫుడ్ స్టాల్స్) ఏర్పాటు.
రైతుల కోసం 100కు పైగా వైద్య శిబిరాలు.
- అందుబాటులోకి మొబైల్ క్లినిక్‌లు.
- కిసాన్-మజ్దూర్ ఐక్యత నినాదాల హౌరు.
రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటూ ర్యాలీల్లో నినాదాలు .
శాంతి భద్రతల పరిరక్షణ కోసం దాదాపు 8,000 మంది భద్రతా సిబ్బంది నియామకం.
రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయంత్ చౌదరి తమకు జీవితం, ప్రేమ, గౌరవం ఇచ్చిన రైతులపై హెలికాప్టర్ నుంచి పూలు చల్లి ఘన స్వాగతం పలకాలని యోచించాం. కానీ యోగి ప్రభుత్వం అనుమతి నిరాకరణ.
జిల్లా అధికారులు ముందస్తు చర్యగా కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యాన్, బీజేపీ ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ నివాసాల వద్ద పోలీసు సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు .
ప్రజా సంఘాల సంఘీభావం..
ఐద్వా, వ్యవసాయ కార్మిక, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. కిసాన్ మహా పంచాయత్‌లో ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే, సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్, కోశాధికారి కష్ణ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, కోశాధికారి ఎస్.పుణ్యవతి, ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు మొమునా మొల్లా, ఆశాశర్మ, సీఈసీ సభ్యురాలు శర్బనీ తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ ఆందోళనలు...
- లాఠీచార్జికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 7న (మంగళవారం) కర్నాల్‌లో మహా పంచాయత్
- సెప్టెంబర్ 9,10 రెండు రోజుల పాటు లక్నోలో రైతు సంఘాల భారీ సమావేశం
- సెప్టెంబర్ 15న రాజస్థాన్‌లో కిసాన్ సంసద్
- సెప్టెంబర్ 27న భారత్ బంద్