Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఒడిషా చిన్నారుల్లో కరోనా వైరస్ వ్యాప్తి రేటు (ఐఆర్) 20 శాతానికి పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నాడు ఒడిషాలో 609 కొత్త కేసులు నమోదు కాగా, వీరిలో 122 మంది 18 ఏళ్ల లోపువారేనని ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో చిన్నారులు, కౌమార దశ వారిలో రికార్డు స్థాయికి ఐఆర్ చేరుకుంది. కొన్ని రోజుల నుంచి ఈ ఐఆర్ శాతం పెరుగుతూ వస్తోంది. చిన్నారుల్లో ఐఆర్ శనివారం నాడు 17.32 శాతం ఉండగా, ఆదివారం 16.27 శాతంగా ఉంది. 'ఇంకా టీకాలు వేయని చిన్నారులు, కౌమార దశవారిలో రోజువారీ కోవిడ్ ఐఆర్ 20.3 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది' అని ఆరోగ్య శాఖ ఆధికారి ఒకరు చెప్పారు.
రోజుకు 1.25 కోట్ల డోసులు : మోడీ
భారత్‌లో రోజుకు 1.25 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇది ప్రపంచంలో అనేక దేశాల జనాభా కంటే ఎక్కువని చెప్పారు. అలాగే అర్హత ఉన్న వారందరికీ వ్యాక్సిన్ మొదటి డోసు వేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్ రికార్డు నెలకొల్పిందని మోడీ ప్రకటించారు. అనేక భౌగోళిక, స్థానిక సమస్యలు ఉన్నా హిమాచల్ ప్రదేశ్ ఈ ఘనత సాధించిందని ప్రధాని ప్రశంసించారు. సిక్కిం, దాద్రా నగర్ హవేలి కూడా ఈ ఘనత సాధించినట్టు చెప్పారు.