Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత రైల్వే ఆస్తులను అయినకాడికి అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను నిరసిస్తూ ఈ నెల 8న దేశవ్యాప్తంగా ప్రదర్శనలకు అఖిల భారత రైల్వేమెన్స్ సమాఖ్య (ఎఐఆర్‌ఎఫ్) పిలుపునిచ్చింది. ఇదొక హెచ్చరిక దినంగా సమాఖ్య పేర్కొంటున్నది. దేశవ్యాప్తంగా గల 68 రైల్వే డివిజన్లలోని రైల్వే కార్మికులందరూ ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వారికి నిర్వహించడానికి ఇవ్వడానికి నాలుగేండ్ల కాలంలో అమలు చేసేలా నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ)ని కేంద్రం ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో అతిపెద్ద రైల్వే యూనియన్ ఏఐఆర్ఎఫ్ నిరసనలకు పిలుపునిచ్చింది. సమాఖ్య ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ అంతిమంగా ఈ ఆస్తులను ప్రయివేటీకరించడం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. భారత రైల్వే ఆస్తులను విక్రయించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలను రైల్వే ఉద్యోగులు అనుమతించబోరని స్పష్టం చేశారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. జంతర్‌మంతర్ వద్ద ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు ధర్నా నిర్వహించాలని అఖిల బీఎస్ఎన్ఎల్ యూనియన్లు, సమాఖ్య (ఏయూఏబీ) నిర్ణయించింది. మరోపక్క రాజకీయ పార్టీలు కూడా ఎన్ఎంపీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి సమాయత్తమవుతున్నాయి.