Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 97 శాతం తల్లిదండ్రుల అభిప్రాయం : సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: గ్రామీణ భారతంలోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పిల్లల తల్లిదండ్రులు 97శాతం మంది పాఠశాలలను సాధ్యమైనంత త్వరగా తెరవాలని కోరుకుంటున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. దాదాపు 1,400 మంది పాఠశాల పిల్లల సర్వే ఆధారంగా ఓ నివేదికను ఆర్థికవేత్తలు జీన్ డ్రెజ్, రీతికా ఖేరా, పరిశోధకుడు విపుల్ పైక్రాతో పాటు దాదాపు 100 మంది వాలంటీర్లు కలిసి తయారు చేశారు. దాదాపు 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో గతేడాది నుంచి పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. సెకండ్‌వేవ్ అనంతరం కొన్ని రాష్ట్రాలు సెకండరీ విద్యార్థుల కోసం వ్యక్తిగత తరగతులను తిరిగి ప్రారంభించాయి. కానీ ప్రైమరీ విద్యార్థులకు తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత రాలేదు. ''పాఠశాలలు మూతపడటంతో రాసే సామర్థ్యంతో పాటు, చదవే సామర్థ్యం కూడా తగ్గిందని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. పాఠశాలలు తిరిగి తెరవడానికి వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి వారిలో చాలా మందికి, తమ పిల్లలకు తమ సొంత జీవితం కన్నా మంచి జీవితం ఉంటుందనే ఏకైక నిరీక్షణ పాఠశాల విద్య మాత్రమే'' దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో ఆన్ లైన్ విద్య వినాశకరమైన ప్రభావాన్ని చూపించింది అని సర్వే నివేదిక పేర్కొంది.
ఆగస్టు ప్రారంభంలో సర్వే నిర్వహించినప్పుడు, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆన్ లైన్ తరగతుల ద్వారా కేవలం 8శాతం మంది పిల్లలు మాత్రమే క్రమం తప్పకుండా చదువుతున్నారని నివేదిక పేర్కొంది. 37శాతం మంది పిల్లలు అసలు చదవడం లేదని తెలిపింది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి, చాలా కుటుంబాలకు స్మార్ట్ ఫోన్ లు అందుబాటులో లేకపోవడం అని నివేదిక పేర్కొంది. ''స్మార్ట్ ఫోన్ ఉన్న కుటుంబాలలో కూడా, ఆన్ లైన్లో క్రమం తప్పకుండా చదువుతున్న పిల్లల నిష్పత్తి పట్టణ ప్రాంతాల్లో కేవలం 31శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతమేనని ఈ నివేదిక తెలిపింది.అసోం, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లు ఆన్ లైన్ తరగతులను పొందలేని వారు పాఠశాలల మూసివేత సమయంలో చదువులకు దూరమయ్యారు. మరోవైపు, కర్నాటక, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్‌లలో విద్యార్థుల ఇండ్లను సందర్శించాలనీ, పిల్లలకు హౌంవర్క్ను ఆఫ్ లైన్లో సాయం చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇతర పిల్లల్లో 15 శాతం మందితో పోలిస్తే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు కేవలం 4 శాతం మంది పిల్లలు మాత్రమే ఆన్లైన్లో క్రమం తప్పకుండా చదువుతున్నారని నివేదిక హైలైట్ చేసింది. ''వారిలో సగం మంది మాత్రమే పఠన పరీక్షలో కొన్ని అక్షరాలకంటే ఎక్కువ చదవగలిగారు'' అని ఈ సర్వేలో వెల్లడైంది.