Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసుల అభ్యంతరం నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత ఉమర్ ఖలీద్ సోమవారం ఢిల్లీ కోర్టులో కొత్త బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు వేసిన బెయిల్ పిటిషన్‌ను ఆయన ఈ సందర్భంగా ఉపసంహరించుకున్నారు. సీఆర్పీసీ 439 సెక్షన్ కింద గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ స్థానంలో సీఆర్పీసీ సెక్షన్ 437 కింద కొత్త అప్పీల్ చేస్తున్నట్టు ఖలీద్ తరపు సీనియర్ న్యాయవాది త్రిదీప్ పైస్ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి అమితాబ్ రావత్‌కు తెలిపారు. బెయిల్ మంజూరు ఆలస్యం చేసేందుకు పోలీసులు ఎత్తుగడలు వేస్తున్నారని కొత్త అప్పీల్లో ఖలీద్ పేర్కొన్నారు. సెక్షన్ 439 ప్రకారం బెయిల్‌కు సంబంధించి హైకోర్టు లేదా సెషన్స్ కోర్టుకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ 437 అనేది నాన్‌బెయిలబుల్ కేసుల్లో బెయిల్ మంజూరుకు సంబంధించింది. సెక్షన్ తప్ప కొత్త పిటిషన్లో తానేమీ మార్చలేదని ఖలీద్ తరపు న్యాయవాది త్రిదీప్ కోర్టుకు తెలిపారు. కొత్త అప్పీల్‌పై పోలీసుల స్పందన కోరిన జడ్జి రావత్ తదుపరి విచారణను ఈ నెల 8కు వాయిదా వేశారు. గతేడాది ఫిబ్రవరిలో చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఉమర్ ఖలీద్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ ఇశ్రాత్ జహన్ సీఆర్పీసీలోని ఇదే రెండు సెక్షన్ల కింద దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ల ప్రామాణికతను ఢిల్లీ పోలీసులు గత నెలలో అభ్యంతరం వ్యక్తం చేశారు.