Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత బృందానికి ఎన్పీఆర్డీ అభినందనలు
- క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి డిమాండ్
న్యూఢిల్లీ : టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొత్తం బృందానికి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపింది. ఈ జట్టు టోక్యోలో అద్భుతమైన ప్రదర్శన కనపర్చి మునుపెన్నడూ లేని విధంగా ఈసారి దేశానికి 19 పతకాలు తెచ్చిపెట్టిందని, ఇది దేశానికి ఎంతో గర్వకారణమని ప్రశంసించింది. మన దేశంలో పారా క్రీడల దయనీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ అథ్లెట్ల విజయం చాలా ముఖ్యమైనదని ఎన్పీఆర్డీ ఈ సందర్భంగా పేర్కొంది. వీరిలో చాలామంది బలహీన నేపథ్యాల నుండి వచ్చారని, అవమానాలు, వివక్షతో సహా అన్ని అసమానతలు, అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు పారాలింపిక్స్‌లో వారు సాధించిన విజయాలను ప్రశంసించే సమయంలో వాటి గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
పేలవమైన క్రీడా మౌలిక సదుపాయాలు, పారా క్రీడలకోసం తగినంతగా నిధులు, వాటిని నియంత్రించే సంస్థలపై రాజకీయ, అధికార సంబంధాల యొక్క హానికరమైన పెత్తనానికి వ్యతిరేకంగా యుద్ధం చేశారని పేర్కొంది. ప్రధానంగా పారా క్రీడలకు ప్రభుత్వం నుంచి కానీ, క్రీడా సంస్థల కానీ లేదా కార్పొరేట్ రంగం నుండి గానీ తగినంతగా మద్దతు లేదని విమర్శించింది.
పతక విజేతలలో ఒకరు వేరేవారు వారు చేసిన తప్పు కారణంగా అనర్హులవాల్సి వచ్చిందని, ఇటువంటి అలసత్వం తీవ్రంగా ఖండించదగినదని స్పష్టం చేసింది. ఒక మహిళా అథ్లెట్ పోలాండ్లోని లుబ్లిన్‌లో జరిగే 4వ ప్రపంచ డెఫ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు గత నెలల్లో మద్రాస్ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవాల్సి వచ్చిందని ఎన్పిఆర్డి ఈ సందర్భంగా గుర్తుచేసింది. గతంలో పలు కారణాల వల్ల పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ సంస్థ నుండి సస్పెన్షన్‌ను ఎదుర్కొంది. టోక్యో ఈవెంట్‌కు ముందు నిర్వహించిన జాతీయ మీట్ నిర్వహణపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మీట్ వేదికను చివరి నిమిషంలో చెన్నై నుండి బెంగళూరుకు మార్చారు. ఈ క్రీడా సంస్థల్లో ప్రభలుతున్న అవినీతిని సరిదిద్దాలని, వాటి పనితీరును ప్రజాస్వామ్యబద్ధం చేయాలని, రాజకీయ పెత్తనం నుంచి దూరంగా ఉంచాలని ఎన్పిఆర్డి డిమాండ్ చేసింది. యూఎన్సీఆర్పీడీ, వికలాంగుల హక్కుల చట్టానికి అనుగుణంగా పారా స్పోర్ట్స్ కోసం సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయాలని పేర్కొంది. అదేవిధంగా పారా క్రీడలకు తగిన కేటాయింపులు చేయడంతో పాటు ఇతర క్రీడలతో సమానంగా చూడాలని డిమాండ్ చేసింది. ఇటువంటి విధానాల ద్వారా మాత్రమే పారా క్రీడాకారులు భవిష్యత్తు ఈవెంట్లతో మరింత ఉత్సాహంతో, ప్రోత్సాహంతో పాల్గొనే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.