Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 284వ రోజూ కొనసాగిన రైతు ఆందోళన
- నేడు కర్నాల్‌లో కిసాన్ మహాపంచాయత్
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపడుతున్న ఉద్యమం హోరెత్తుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత తొమ్మిది నెలలుగా రైతుల ఆందోళన నిర్విరామంగా కొనసాగుతున్నది. సోమవారం 284వ రోజూ రైతు ఆందోళన కొనసాగింది.
నేడు కర్నాల్‌లో కిసాన్ మహా పంచాయత్
కర్నాల్ పోలీస్ లాఠీచార్జ్‌కు వ్యతిరేకంగా మంగళవారం కిసాన్ మహా పంచాయత్ నిర్వహిస్తామనీ ఎస్కేఎం ప్రకటించింది. ఈ కిసాన్ మహా పంచాయత్‌లో ఎస్కేఎం అగ్రనేతలంతా పాల్గొంటారని తెలిపింది. కర్నాల్‌లోని ధాన్యం మార్కెట్లో రైతులు కిసాన్ మహాపంచాయత్ నిర్వహిస్తారని ప్రకటించిన తరువాత, హర్యానా ప్రభుత్వం ఆ ప్రాంతంలో 144వ సెక్షన్ విధించింది. ఆ ప్రాంత పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఐపీసీ సెక్షన్ 188తో కేసులు పెడతామని రైతులను బెదిరిస్తున్నది. కాగా, ఈ అణచివేత చర్యలు తమ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయలేవని ఎస్కేఎం స్పష్టం చేసింది.
మండీలకు పడిపోయిన ఆదాయం
వ్యవసాయ చట్టాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న మండీల ఆదాయం భారీగా పడిపోయిందనీ, మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు 66శాతం ఆదాయాన్ని కోల్పోయిందని ఎస్కేఎం తెలిపింది. గత రెండేండ్లలో ఒక్క మండీ కూడా మూసివేయలేదంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను ఎస్కేఎం తప్పుపట్టింది.
యూపీలోనూ అసెంబ్లీలో కొత్త చట్టాలు ఆమోదించిన తర్వాత మండీలు ఆదాయాన్ని కోల్పోయాయనీ ఎస్కేఎం తెలిపింది. మరోవైపు కేంద్ర వ్యవసాయ మంత్రి మాత్రం... అమెజాన్ ఇండియా కిసాన్ స్టోర్ ప్రారంభోత్సవంలో బిజీగా ఉన్నారని ఎస్కేఎం విమర్శించింది. పంటలు, భీమాను కార్పొరేట్లకు కట్టబెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు ఎరువులు, విత్తనాలను సైతం వారికి కట్టబెడుతున్నదని ఎస్కేఎం విమర్శించింది.