Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకపోతే రైతులు తగిన బుద్ధి చెబుతారు : వి.శ్రీనివాసరావు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని, లేకపోతే మోడీ సర్కార్కు రైతులు తగిన బుద్ధి చెబుతారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘూ వద్ద రైతుల ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతు, కార్మిక బందం సంఘీభావం తెలిపింది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులను స్వాగతించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సింఘు సరిహద్దుల్లో గత తొమ్మిది నెలలుగా ఉద్యమం చేస్తున్న రైతాంగానికి ఏపి రైతు, కౌలు రైతు, కార్మిక సంఘాలు అభినందలు తెలియజేస్తున్నాయని అన్నారు. మోడీ రైతుల వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేకపోతే రైతులు తగిన బుద్ది చెబుతారని బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ముజఫర్నగర్లో జరిగిన కిసాన్ మహా పంచాయత్ విజయవంతమైందని, ఆలాంటి సభలు దేశమంతా నిర్వహించి రైతులను చైతన్యం చేస్తామని అన్నారు. మోడీ కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడంలో భాగంగానే ఈ చట్టాలు చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలతో సహా సర్వస్వం ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఇక వ్యవసాయాన్ని కూడా వదల కూడదనే కుట్ర మోడీ సర్కార్ చేస్తుందని విమర్శించారు. దేశ ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని, ప్రజలపై భారాలు వేస్తున్నారని విమర్శించారు. కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, మోడీ సర్కార్ మాత్రం దానిపై ఆలోచన చేయటం లేదని విమర్శించారు. కనీస మద్ధతు ధర ఇవ్వడం కుదరదని సుప్రీం కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మద్దతు ధర కొసాగుతుందని కేంద్ర మంత్రులు చెబుతున్నారని, దీన్ని ఎలా నమ్మమంటారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడతూ రైతులు పంటలకు మద్దతు ధరల హామీ చట్టం చేసి, దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధానం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఇప్పటికే ఈ ఉద్యమంలో ఆరు వందల మంది రైతులు మతి చెందారని, వారి త్యాగాలతో ఉద్యమాన్ని మరింత ఉధతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుసంఘం నాయకురాలు కె.హేమలత, కె.అజరు కుమార్, కౌలురైతుల సంఘం నాయకులు కేతా గోపాల్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు సుబ్బరావమ్మ తదితరులు పాల్గొన్నారు