Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికపోరాటానికి మద్దతు
- విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు
- సెప్టెంబర్ 27 భారత్ బంద్కు మద్దతు: డి.రాజా
న్యూఢిల్లీ : రాబోయే ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని సీపీఐ ప్రధానకార్యదర్శి డి. రాజా పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ అధ్యక్షతన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం రెండురోజులపాటు (సెప్టెంబర్ 4, 5 తేదీల్లో) ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయం (అజరు భవన్)లో జరిగింది. నివేదికపై సమగ్ర చర్చ తరువాత ఏకగ్రీవంగా ఆమోదించారు. భారత్ బంద్ మద్దతు, మోడీ ప్రయివేటీకరణ విధానం ఆపాలని రెండు తీర్మానాలు ఆమోదించారు. అనంతరం జాతీయ కార్యవర్గం తీసుకున్న నిర్ణయాలను సీపీఐ కార్యదర్శులు అతుల్ కుమార్ అంజన్, బినరు విశ్వంలతో కలిసి రాజా విలేకరులకు తెలిపారు.
కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిగిందనీ, కేరళలో చారిత్రాత్మక విజయం వామపక్ష ప్రభుత్వం సొంతం చేసుకున్నదని తెలిపారు. బెంగాల్లో వామపక్షాలకు సీట్లు రాలేదనీ, దీనిపై వామపక్షాలు ఆలోచనలు చేయాలని అన్నారు. అసోంలో తక్కువ ఓట్ల మెజార్టీ (0.78 శాతం)తోనే బీజేపీ నెగ్గిందని తెలిపారు. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 27 భారత్ బంద్కు సీపీఐ మద్దతు ఇస్తుందన్నారు. మోడీ సర్కార్ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని 19 ప్రతిపక్ష పార్టీలు పిలుపు ఇచ్చాయనీ, అందులో భాగంగా తమ పార్టీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఆందోళనల్లో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. సెప్టెంబర్ 12 నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి 25 ఏండ్లు పూర్తవుతుందనీ, కనుక ఆ రోజున మహిళ రిజర్వేషన్ డిమాండ్ రోజుగా నిర్వహించనున్నట్టు తెలిపారు.
ప్రయివేటీకరణకు వ్యతిరేక పోరాటానికి మద్దతు
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ, రక్షణ రంగ పరిశ్రమల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టే పోరాటానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలతో సామాజిక, రాజకీయ కార్యకర్తలను వేధించడం ఆపాలనీ, రాజద్రోహ చట్టం, ఉపాను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఫెడరలిజాన్ని బలహీనపరచడంపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసిందని అన్నారు. దీన్ని వ్యతిరేకించాలనీ, రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనగణనలో కులాలను చేర్చాలని తమ పార్టీ ఎప్పుప్పటి నుంచో డిమాండ్ చేస్తుందనీ, మద్దతు ఇస్తుందని తెలిపారు. ఏదేమైనా, సుప్రీం కోర్టు నిర్ణయం ద్వారా విధించిన ప్రస్తుత 50 శాతం పరిమితిని సవరించకపోతే, ప్రయోజనమేమీ ఉండదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ రాష్ట్రాల్లో కుల సంఘర్షణలను ఉపయోగించుకోవడానికి బీజేపీ ఉద్దేశపూర్వకంగా దీనిని తప్పించుకుంటోందని విమర్శించారు.
దేశంలో ఆర్థికం అస్తవ్యస్తం
దేశం అనేక సంక్షోభాలలో కూరుకుపోతూనే ఉన్నదనీ, దేశ ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి తప్పుల నుంచి దేశం ఇంకా కోలుకోలేదని పేర్కొన్నారు. దానికి తోడు కొనుగోలు శక్తి పడిపోయిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల 2016 నుండి ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని అన్నారు. దేశంలో నిరుద్యోగం అత్యున్నత స్థాయిలో ఉందని పేర్కొన్నారు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్, ఇతర పార్లమెంటరీ కమీలు చాలా అనవసరంగా మారుతున్నాయనీ, ఇది చాలా ఆందోళన కలిగించే సంకేతమని అన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తి క్రమపద్ధతిలో బలహీనపడుతోందన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ విభజన, మతధ్రువ ఎజెండాను దూకుడుగా ముందుకు తెస్తున్నాయనీ, లౌకికవాదం, సోషలిజం వంటి ప్రాథమిక సిద్ధాంతాలను మార్చాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజద్రోహం వంటి అణచివేత వలసవాద చట్టాలను ప్రజల స్వేచ్ఛపై ఉపయోగిస్తున్నారనీ, లవ్ జిహాద్ వంటి చట్టాలు, మత మార్పిడి నిరోధక చట్టాలు సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని వివరించారు. దేశంలోని కార్మికులు, రైతులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదనీ, మతం, కుల ప్రాతిపదికన శ్రమించే ప్రజలపై యుద్ధం చేయడమే వారి ఎజెండా అని విమర్శించారు.
బెజవాడలో సీపీఐ జాతీయ మహాసభలు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. అయితే మహాసభల తేదీలను అక్టోబర్ 2 నుంచి 4 వరకు జరగబోయే పార్టీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు. అలాగే కార్యవర్గం భారత్ బంద్కు మద్దతు నిస్తున్నట్టు ఆయన చెప్పారు.