Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో కార్పొరేట్ల చేతుల్లోకి చదువు
- ఇక విద్యారంగం భారమే: విద్యావేత్తలు, నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలో మోడీ ప్రభుత్వ పాలనలో విద్యా రంగమూ 'ప్రయివేటు' బాధను ఎదుర్కొంటున్నది. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయివేటు యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గత నాలుగేండ్లలో దేశంలో 131 నూతన ప్రయివేటు యూనివర్సిటీలు నెలకొల్పబడ్డాయి. అయితే, దేశంలో ప్రయివేటు యూనివర్సిటీల సంఖ్య ఏటికేడు విద్యావేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం విద్యార్థుల భవిష్యత్తుకు ఏమాత్రం శ్రేయస్కరం కాదనీ, దేశ భవిష్యత్తును కూడా అది అంధకారంలోకి నెట్టేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మోడీ సర్కారు దృష్టిసారించి విద్యావిధానాన్ని సరిచేయాలని సూచించారు.దేశంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి 'ప్రయివేటు'కు మార్గం ఏర్పడిందనీ, ఇదే మార్గంలో విద్యావ్యవస్థనూ కేంద్రం నాశనం చేయాలని చూస్తున్నదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్హెచ్ఈ) 2019-20 సమాచారం ప్రకారం.. 2015-16లో ప్రయివేటు యూనివర్సిటీల సంఖ్య 276గా ఉన్నది. అయితే, 2019-20 నాటికి ఈ ప్రయివేటు యూనివర్సిటీల సంఖ్య 407కు పెరగడం గమనార్హం. అంటే, ఈ ఐదేండ్ల కాలంలో కొత్తగా ఏర్పాటైన ప్రయివేటు యూనివర్సిటీల సంఖ్య దాదాపు 50 శాతంగా (131 విద్యాసంస్థలు) ఉన్నది. అయితే, వీటితో పాటు మరికొన్ని ప్రయివేటు యూనివర్సిటీలు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉండటం గమనార్హం.
వాస్తవానికి దేశంలో విద్య సంస్థలు ఆరు విభాగాలుగా విభజించబడ్డాయి. ఇవి స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ, స్టేట్ ప్రయివేటు యూనివర్సిటీ, డీమ్డ్ ప్రయివేటు యూనివర్సిటీ, డీమ్డ్ పబ్లిక్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ గా ఉన్నాయి. ఈ ఆరింటిలో ప్రతి విభాగంలోనూ విద్యాసంస్థల పెరుగుదల ఉన్నది. అయితే, గత ఐదేండ్ల కాలంలో మాత్రం 'స్టేట్ ప్రయివేటు యూనివర్సిటీ' విభాగంలో మాత్రం పెరుగుదల గణనీయంగా ఉండటం గమనార్హం. 2015-16లో ఈ కేటగిరిలో విద్యాసంస్థల సంఖ్య 197గా ఉన్నది. అయితే, అది 2019-20లో 327కు పెరగడం గమనార్హం. అంటే, పెరుగుదల 66 శాతంగా ఉన్నది. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కేటగిరిలో పెరుగుదల 80 శాతంగా ఉన్నది. దేశంలో 2015-16లో వీటి సంఖ్య 75గా ఉండగా.. 2019-20లో అది 135కు పెరగడం గమనార్హం. దేశంలో స్టేట్ పబ్లిక్ కేటగిరిలో పెరుగుదల 17.3 శాతంగా ఉన్నది. 2015-16 లో ఈ విభాగంలోని విద్యాసంస్థల సంఖ్య 329గా ఉండగా.. అది 2019-20 నాటికి 386కు చేరాయి. ఇదే కాలంలో సెంట్రల్ యూనివర్సిటీల సంఖ్య 43 నుంచి 48కి ( 12 శాతం పెరుగుదల) పెరిగాయి. డీమ్డ్ పబ్లిక్ యూనివర్సిటీల సంఖ్య 32 నుంచి 36కు (పెరుగుదల 12.5 శాతం) చేరాయి. ఇక ఈ ఐదేండ్ల కాలంలో డీమ్డ్ ప్రయివేటు యూనివర్సిటీ కేటగిరిలో మాత్రం ఒక్క విద్యాసంస్థ మాత్రమే నెలకొనడం గమనార్హం.
ఏఐఎస్హెచ్ఈ నివేదిక ప్రకారం.. గత కొన్నేండ్లలో దేశంలో సగటున ప్రతి ఏడాది వెయ్యికి పైగా కాలేజీలు పుట్టుకొచ్చాయి. అయితే, వీటిలో 80 శాతానికి పైగా ప్రయివేటు సంస్థలే కావడం గమనార్హం. అయితే, దేశంలో విద్య అనేది వ్యాపారం కాదనీ, కార్పొరేట్ల ప్రయోజనాలకు పాటుపడుతూ దేశంలోని విద్యా విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని విద్య నిపుణులు ఆరోపించారు. రాజకీయ నాయకులు, వ్యాపారులు విద్యారంగంలోకి ప్రవేశించి విద్యాసంస్థలు నెలకొల్పుతున్నారనీ, దీంతో విద్యలో నాణ్యత తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా, ప్రభుత్వ అండదండలతో దేశంలో పెరుగుతున్న ప్రయివేటు యూనివర్సిటీలు.. విద్యను వ్యాపారంగా మార్చేశాయన్నారు. దీంతో డిగ్రీ పట్టాలు అంగట్లో సరుకుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.