Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రిబ్యునళ్లలో ఖాళీలు.. కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ : ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని ఆగ్రహించింది. ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షిస్తోందని మండిపడింది. ఇక తమ వద్ద కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, వారంలోగా కేంద్రం తమ తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో నియామకాలకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
''ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్), ఎస్‌సీఎల్‌ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రైబ్యునల్) వంటి కీలక ట్రైబ్యునళ్లలో ఖాళీలున్నాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనవి. వీటితోపాటు సాయుధ బలగాలు, వినియోగదారులకు సంబంధించిన ట్రైబ్యునళ్లలోనూ చాలా ఖాళీలు ఉన్నాయి. దీనివల్ల అనేక కేసుల్లో పరిష్కారం లభించక వాయిదాలు వేయాల్సిన పరిస్థితి వస్తోంది'' అని ధర్మాసనం పేర్కొంది. దీనికి కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..రెండు నెలల్లోగా నియామకాలు చేపడతామని తెలిపారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ''గత రెండేండ్ల నుంచీ ట్రిబ్యునళ్లలో ఖాళీలున్నాయి. ఇప్పటివరకూ ఒక్క నియామకం కూడా చేపట్టలేదు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదు. ఇది చాలా విచారకరం. కేంద్రంతో ఘర్షణకు దిగాలనుకోవట్లేదు. కానీ మీరు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సీబీఐ ఇంకా పంజరంలో చిలకే..
దానికి స్వేచ్ఛ ఉండాలి.. : సీబీఐ పనితీరుపై సుప్రీం
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పనితీరు పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ కేసులు కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. కేసుల విచారణపై దర్యాప్తు సంస్థ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికింది. సీబీఐ ఇప్పటికీ పంజరంలో చిలకలాగే వ్యవహరిస్తోందని ఆ చిలకకు స్వేచ్ఛ కావాలంటూ గతంలో మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. షోపియాన్ జిల్లాలో ఇద్దరు మహిళలు హత్యకు గురైన ఘటనలో తప్పుడు సాక్ష్యాలు సృష్టించడంతోపాటు సాక్షులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై జమ్మూకాశ్మీర్‌కు చెందిన న్యాయవాదుల అరెస్టుకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.