Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 ఏండ్ల యువతిపై సామూహిక లైంగికదాడి, హత్య
- మృతదేహంపై కత్తి పోట్లు..తీవ్రమైన గాయాలు
- బాధితరాలు సివిల్ డిఫెన్స్ ఉద్యోగి
- బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఐద్వా, మహిళా కాంగ్రెస్ నేతలు
- న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న మహిళా సంఘాలు
- ఢిల్లీ పోలీసులు, జాతీయ మీడియా మౌనంపై ట్విట్లర్లో వెల్లువెత్తిన ప్రశ్నలు
న్యూఢిల్లీ : ''జస్టిస్ ఫర్ రాబియా'' అంటూ సామాజిక మాధ్యమాలు హౌరెత్తుతున్నాయి. ఫరీదాబాద్‌లో సామూహిక లైంగికదాడి, హత్యకు గురైన 21 ఏండ్ల యువతికి న్యాయం చేయాలని ట్విట్టర్లో నెటిజన్లు డిమాండ్ చేశారు. జస్టిస్ ఫర్ రాబియా హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. సెప్టెంబర్ 4 నుంచి 70 వేల ట్విట్లతో జస్టిస్ ఫర్ రాబియా ట్విట్టర్లో ప్రచారం హౌరెత్తుతుంది. ఢిల్లీ పోలీసులు, జాతీయ మీడియా సంస్థలు ఈ విషయంలో మౌనంగా ఉండటంపై ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు. అయితే, ఈ హత్య కేసులో ఇంకా చాలా ఉన్నదనీ, కస్టడీలో ఉన్న నిందితుడిని తప్పనిసరిగా ప్రశ్నించాలనీ, ఈ అనాగరిక ఘటన వెనుక అసలు కారణాన్ని వెతకాలని ట్విట్టర్లో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఐద్వా, మహిళ కాంగ్రెస్ బృందాలు కలిసి అండగా ఉంటామని హామీ ఇచ్చాయి.
అసలేం జరిగింది..?
21 ఏండ్ల సివిల్ డిఫెన్స్ ఉద్యోగి రాబియా సైఫీ సౌత్ ఈస్ట్ ఢిల్లీ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఆఫీసులో ఉద్యోగం చేస్తుంది. ఆమె తన కుటుంబంతో ఢిల్లీలో సంగమ్ విహార్ నివాసం ఉంటుంది. ఆమె డిఫెన్స్ ఫోర్స్‌కు కొత్తది. నాలుగు నెలల క్రితమే ఆమె ఉద్యోగంలో చేరారు. ఆగష్టు 27న ఆమెను ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత ఆమెపై కూడా నిందితులు లైంగికదాడికి పాల్పడి కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపారు.
అయితే మరోవైపు రాబియా కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు లాజ్‌పత్ నగర్లో పని ముగించుకొని ఇంటికి వస్తుండగా నిందితుడు కిడ్నాప్ చేశాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం అనేక చోట్ల వెతకడానికి ప్రయత్నించారు. వారు కలెక్టర్ నుంచి సహాయం కోరినప్పటికీ ఎలాంటి సహాయం అందలేదు. తరువాత ఆమె మృత దేహం కనిపించింది. డెత్ రిపోర్టు ప్రకారం మృత దేహం అనేక చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఆమె మరణానికి కారణం ముఖ్యమైన అవయవాలకు గాయాలు, రక్తస్రావమని పేర్కొంది. మెడ, తల, ఛాతీ ఇతర అవయావాలపై గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్టు తెలిపింది.
నిందితుడు బాధితురాలి భర్త నిజాముద్దీన్ అని తెలిసింది. దంపతుల మధ్య విభేదాల కారణంగానే నిందితుడు నిజాముద్దీన్ ఆమెను కిడ్నాప్ చేశాడు. రాబియా కుటుంబం వారి వివాహాన్ని ఆమోదించనందున ఇద్దరూ కోర్టులో రహస్యంగా వివాహం చేసుకున్నారని అతను చెప్పాడు. దీని తరువాత రాబియా సైఫీ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుందని అనుమానించి ఆమెతో తలపడ్డానని అతను ఆరోపించాడు. అతను ఆమెను ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతను ఆమెను చంపేశాడు. సైఫీని చంపిన తరువాత నిజాముద్దీన్ కలింది కుంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఒ) లైంగికదాడి, హత్య కేసులో న్యాయమైన విచారణకు హామీ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఫిర్యాదులను ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదు
సామూహిక దారుణానికి పాల్పడి.. కొట్టి హత్యకు గురైన రాబియా సైఫీ కుటుంబ సభ్యులను ఐద్వా, మహిళా కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ఆశాశర్మ, ఢిల్లీ ఉపాధ్యక్షురాలు కవిత శర్మ బాధితరాలి తల్లిదండ్రులను కలుసుకున్నారు. రాబియాకు న్యాయం జరిగేవరకు అన్ని మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనీ, తక్షణ చర్యల కోసం తల్లిదండ్రుల ఫిర్యాదులను పట్టించుకోలేదని విమర్శించారు. మహిళా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షరాలు నెట్టా డిసౌజాతో పాటు మహిళ కాంగ్రెస్ బృందం బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. బీజేపీ పాలనలో మహిళలపై ఘోరమైన నేరాలు సాధారణం అయ్యాయని, న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. అలాగే భీమ్ ఆర్మీ, ఆజాద్ సమాజ్ పార్టీ (కాశీరామ్) సభ్యులు కూడా పరామర్శించారు.
న్యాయం కోసం ఆందోళనలు
రాజధాని అంతటా వీధుల్లో నిరసనలు కూడా జరిగాయి. అక్కడ ప్రజలు రాబియాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాబియా, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (ఎఎంయు) విద్యార్థులు నిరసనలు కూడా చేపట్టారు. జస్టిస్ ఫర్ రాబియా అంటూ అలీఘడ్ ముస్లిం వర్సిటీ విద్యార్థులు కొవ్వొత్తులు ప్రదర్శన నిర్వహించారు. క్రిష్ణగంజ్‌లో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేసి, హత్య వెనుక అసలు నిందితుడిని కనుగొనాలని అధికారులను మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి, కాంగ్రెస్ ఎంపీ జ్వోతిమణి, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షురాలు శివానీ చోప్రా, సామాజిక కార్యకర్త ఖలీదా ప్రవీణ్, అన్సారాజ్ మీనా డిమాండ్ చేశారు.