Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణంలో 37 శాతం మంది.. పట్టణాల్లో 19 శాతం
- అణగారినవర్గాల చిన్నారుల విద్యపై లాక్డౌన్ దెబ్బ
- తల్లిదండ్రుల్లో ఆందోళన
- ఆర్థికవేత్తలు జీన్డ్రీజ్, రీతికా ఖేరాల అద్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి, లాక్డౌన్ పరిస్థితులు దేశంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ అంశాలు ఇప్పటికే వాణిజ్య, వ్యాపారాలను తీవ్ర నష్టానికి గురి చేశాయి. పేదలు, వలసకార్మికులు, మధ్యతరగతి ప్రజలను కోలుకోకుండా చేశాయి. ముఖ్యంగా, లాక్డౌన్ పరిస్థితులు దేశంలోని అణగారిన వర్గాల చిన్నారులకు చెందిన చదువు పైనా తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కనీసం చదివే నైపుణ్యమూ వారిలో తగ్గిపోయింది. ఈ వర్గాలకు చెందిన చిన్నారుల చదువుపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 1 నుంచి 8వ తరగతికి చెందిన 1400 మంది విద్యార్థుల నుంచి ఈ అధ్యయనంలో సమాచారాన్ని సేకరించారు. వీరిలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారు కాగా.. 60 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారే. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది నుంచి దేశంలో పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదికను ఆర్థికవేత్తలు జీన్ డ్రీజ్, రీతికా ఖేరా లు విడుదల చేశారు.
మహమ్మారి కాలంలో తాము అసలు చదువుకు నోచుకోలేదని గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు 37 శాతం మంది విద్యార్థులు తెలిపారు. ఇది పట్టణ ప్రాంతాల్లో 19 శాతంగా ఉన్నది. అయితే, తాము 'సమయానికి' చదువుకున్నట్టు 35 శాతం మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు, 34 శాతం మంది పట్టణ ప్రాంత విద్యార్థులు వివరించారు. మహమ్మారి కాలంలో తమ చదువును క్రమం తప్పకుండా కొనసాగించినట్టు కేవలం28 శాతం మంది గ్రామీణ విద్యార్థులు వెల్లడించారు. పట్టణ ప్రాంతం విషయంలో ఇది 47 శాతంగా ఉన్నది.
గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 51 శాతం ఇండ్లలోనే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే, ఇందులో 8 శాతం మంది విద్యార్థులే ఆన్లైన్ తరగతులకు రెగ్యులర్గా హాజరయ్యారు. పట్టణ ప్రాంతాల విషయంలోనూ ఇది ఆశించినంతగా లేదు. ఇక్కడ 77 శాతం ఇండ్లలో స్మార్ట్ ఫోన్లు ఉన్నప్పటికీ.. 24 శాతం మంది విద్యార్థులే ఆన్లైన్ తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావడం గమనార్హం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 36 శాతం మంది విద్యార్థులు తమ ఆన్లైన్ క్లాసుల కోసం ఇతరులకు చెందిన స్మార్ట్ఫోన్లపై ఆధారపడ్డారు. ఇది పట్టణ ప్రాంతాల్లో 30 శాతంగా ఉండటం గమనార్హం. ఇక పాఠశాలలు ఆన్లైన్ తరగతులను రెగ్యులర్గా కొనసాగించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో 43 శాతం మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నప్పటికీ పాఠాలు వినలేకపోయారు.
ఇక తమ చిన్నారుల చదువుల పైన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం మంది తల్లిదండ్రులు.. తమ చిన్నారుల చదువు నైపుణ్యం గతేడాదిన్నర కాలంలో తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంతాల విషయంలో ఇది 65 శాతంగా ఉండటం గమనార్హం. ఇక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథక పరిహారాన్ని తాము పొందలేదని 14 శాతం మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు, 20 శాతం మంది పట్టణ ప్రాంత విద్యార్థులు వెల్లడించడం గమనార్హం. ఇక 3-5 గ్రేడ్ల కు చెందిన విద్యార్థులు కొన్ని పదాలను మించి చదవలేకపోతున్నారని వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం మంది కనీసం ఒక్క ముక్క కూడా చదవలేకపోతున్నారని తేలింది.
తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థికభారం..
తాజా అధ్యయనం ప్రకారం.. దేశంలోని పాఠశాలలు మూతపడి దాదాపు 17 నెలలు అయింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది శాతం మంది చిన్నారులే ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారు. ఆన్లైన్ తరగతులకు హజరయ్యేందుకు చిన్నారులకు అవసరమైన స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ కనెక్షన్లను అందించేందుకు అణగారిన వర్గాలకు చెందిన తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడింది.
అక్షరాస్యత రేటు ఆందోళనకరం
ఇటు దేశంలోని చిన్నారుల్లో అక్షరాస్యత రేటూ ఆందోళనకరంగా ఉన్నది. గత పదేండ్ల నుంచి ఇది జాతీయ సగటు కంటే (2011 జనాభా లెక్కల ప్రకారం) చాలా తక్కువగా ఉన్నదని వెల్లడైంది. అన్ని రాష్ట్రాలకు చెందిన 10-14 ఏండ్ల లోపు చిన్నారుల్లో సగటు అక్షరాస్యత రేటు 88 శాతం నుంచి 98 శాతంగా ఉన్నది. ఒక్క బీహార్లో మాత్రం ఇది 83 శాతంగా ఉన్నది. అయితే, దేశంలోని సగటు అక్షరాస్యత 91 శాతంగా ఉండటం గమనార్హం.