Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు గురువారం జరగబోయే 13వ బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కానున్నారు. ఆన్లైన్లో జరగబోయే ఈ సమావేశానికి మోడీ అధ్యక్షత వహిస్తారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల నేతలు పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సనారో హాజరవుతున్నారు. వీడియో లింక్ ద్వారా జిన్పింగ్ ఈ సమావేశంలో పాల్గొంటారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునియాంగ్ తెలిపారు. ''కొనసాగింపు, సంఘటితం, ఏకాభిప్రాయం కొరకు బ్రిక్స్ దేశాల మధ్య అంతర్గత సహకారం'' అన్నది ఈ ఏడాది సదస్సు ప్రధాన అంశంగా వుంది. ఈ సదస్సు కోసం భారత్ నాలుగు ప్రాధాన్యతా రంగాలను పేర్కొంది. బహుముఖ వ్యవస్థను సంస్కరించడం, తీవ్రవాదంపై పోరు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం డిజిటల్, సాంకేతిక సాధనాలను ఉపయోగించడం, ప్రజల మధ్య పరస్పర మార్పిడులను పెంచడం ప్రాధాన్యతలుగా పేర్కొంది. ఈ అంశాలకు తోడు, కోవిడ్ ప్రభావం, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు.