Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీర ప్రాంతాలకు మరింత నష్టం
- 2070 నాటికి 100 రెట్లు అధికం
- తాజా అధ్యయనం
న్యూఢిల్లీ : ప్రపంచానికి తీవ్ర సమస్యగా పరిణమించిన గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఇప్పటికే ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నది. ఈ విషయంలో అనేక దేశాలు ఎంతగా దృష్టి సారించినప్పటికీ అమెరికా వంటి కొన్ని దేశాలు తమ సొంత ప్రయోజనాలే అజెండాగా వ్యవహరిస్తుండటంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టంగా మారింది. దీంతో గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. ముఖ్యంగా, దీని ప్రభావం తీర ప్రాంతాలపై రాబోయే కాలంలో అధికంగా చూపనున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయం ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనాన్ని 'నేచర్ క్లైమేట్ చేంచ్' జర్నల్‌లో ప్రచురించారు.
ఆ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం
సముద్ర నీటిమట్టం స్థాయిలు అధికంగా ఉన్న ప్రాంతాలపై ఈ అధ్యయనం దృష్టిని సారించింది. ఈ అధ్యయనం ప్రకారం.. ఈ శతాబ్దం చివరినాటికి తీర ప్రాంతాలపై ప్రతి ఏడాది గ్లోబల్‌వార్మింగ్ తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. 2070 నాటికి ఈ ప్రభావం వంద రెట్లు అధికంగా ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,283 ప్రదేశాలలో సగం వరకు ఈ ప్రభావాన్ని ఎదుర్కోనున్నాయి. ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలలో దక్షిణార్ధగోళం, మధ్యధరా సముద్రం, అరేబియా ద్వీపకల్పం, ఉత్తర అమెరికా పసిఫిక్ తీరం దక్షిణ భాగం, హవాయి, కరేబియన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా లు ఉన్నాయి. ఇక ఉత్తరమెరికాలోని ఉత్తర పసిఫిక్ తీరం, ఆసియాలోని పసిఫిక్ తీరాలు తక్కువ ప్రభావితం అయ్యే ప్రాంతాల్లో ఉన్నాయి.
వాతావరణ నిపుణుల హెచ్చరిక
భవిష్యత్తు వాతావరణం గురించి ప్రస్తుతం అనిశ్చితి ఉన్నప్పటికీ పారిశ్రామిక పూర్వ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 లేదా 2 డిగ్రీల సెల్సియస్ పెరిగాయన్న విషయాన్ని పరిశోధకులు గుర్తు చేశారు. అయితే, ఇలాంటి పరిస్థితులు వ్యక్తిగతంగా దేశాలకే కాకుండా ప్రపంచ మానవాళికీ ముప్పుగా పరిణమించనున్నదని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ముంచుకొస్తున్న ఈ ఉపద్రవాన్ని నియంత్రించే విషయంలో ప్రపంచదేశాలు ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు.