Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం రూలింగ్
న్యూఢిల్లీ : రైళ్లు ఆలస్యంగా నడిచినట్లైతే ప్రయాణికులకు రైల్వేలు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. తమ అధీనంలో లేని కారణాల వల్ల రైళ్ళ రాకపోకల్లో జాప్యం జరిగిందని రుజువు చేయలేని పక్షంలో కచ్చితంగా నష్టపరిహారమివ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ''ఇవన్నీ పోటీతత్వంతో కూడిన, జవాబుదారీతనం కలిగిన రోజులు. ప్రైవేటు రవాణాతో పోటీ పడి ప్రజా రవాణా మనుగడ సాధించాలి. వారు వారి వ్యవస్థను, పనితీరును మెరుగుపరుచుకోవాలి. అధికారుల, పాలనా యంత్రాంగం దయా దాక్షిణ్యాలపై ప్రజలు లేదా ప్రయాణికులు వుండాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరు బాధ్యత వహించాలి.'' అని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన బెంచ్ మంగళవారం పేర్కొంది. 2016లో తన కుటుంబంతో కలిసి జమ్మూకి వెళుతున్న ఒక ప్రయాణికుడి రైలు నాలుగు గంటలు ఆలస్యమైంది. ఆ ప్రయాణికుడికి నష్టపరిహారం చెల్లింపును కోర్టు సమర్ధించింది. రైలు ఆలస్యమవడం వల్ల వారు వెళ్ళాల్సిన విమానాన్ని ఎక్కలేకపోయారు. దాంతో శ్రీనగర్‌కు ఎక్కువ ఖర్చు పెట్టి టాక్సీలో వెళ్ళాల్సి వచ్చింది. పైగా దాల్ సరస్సులో బోటు ఎక్కేందుకు చేసుకున్న బుకింగ్ కూడా కోల్పోయారు. రైల్వేలు అందించే సేవలో లోపంగా జిల్లా వినియోగదారుల ఫోరమ్ దీన్ని పేర్కొంది. సదరు ప్రయాణికుడికి టాక్సీ ఖర్చు కింద రు.15వేలు, బుకింగ్ ఖర్చుల కింద రు.10వేలు, వారు కలిగించిన మానసిక విచారానికి, లిటిగేషన్ ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ5వేలు ఇవ్వాలని ఫోరమ్ వాయవ్య రైల్వేను ఆదేశించింది. దాంతో రైల్వే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకుంది. కింది స్థాయిల్లో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆలస్యం కావడానికి చాలా కారణాలు వుండవచ్చని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి పేర్కొన్నారు. కానీ కోర్టు వారి వాదనలతో ఏకీభవించలేదు. ఆలస్యమవడానికి కారణాలు చెప్పాల్సిందేనని, నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.