Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్జీటీకి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నివేదిక
న్యూఢిల్లీ : రాయలసీమ ఎత్తి పోతల పథకం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టడం లేదని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పేర్కొంది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు సంబంధించిన పనులు మాత్రమే ఇప్పటి వరకూ చేపట్టినట్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనానికి నివేదిక అందించింది. ఏపీ ప్రభుత్వం ధిక్కరణ చర్యలకు పాల్పడుతున్నదంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్ రామకృష్ణన్, విషయనిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నెల 6న ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అందించిన నివేదికను ధర్మాసనం పరిశీలించి రికార్డుల్లోకి నమోదు చేసింది. కృష్ణాబోర్డు, తాజా కేంద్రం నివేదికల్లో ఛాయాచిత్రాలు చూస్తుంటే ఉల్లంఘనలు జరిగినట్టు స్పష్టమవుతున్నదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ధర్మాసనానికి తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు అయిన తరువాత ఏపీ ప్రభుత్వం పనులు నిలిపివేసిందన్నారు. ధర్మాసనం అనుమతిస్తే డ్రోన్ల ద్వారా వీడియో ఆధారాలు అందజేస్తామని తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రాంచంద్రరావు తెలిపారు. ఉల్లంఘనలకు సంబంధించి తమ వద్ద ఛాయాచిత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని ధర్మాసనానికీ, ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల వద్ద ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వెంకటరమణి, అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ మాధురి దొంతిరెడ్డిలు ధర్మాసనానికి పునరుద్ఘాటించారు. పనులు నిలిపివేసినట్టు అండర్‌టేకింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది.
పర్యావరణ శాఖ నివేదిక
''కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ శాస్త్రవేత్త పసుపులేటి సురేశ్‌బాబు ఈ నెల 6న రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని సందర్శించారు. ఆసమయంలో చీఫ్ ఇంజినీరు ఆర్.మురళీనాథ రెడ్డి, కార్యనిర్వాహక ఇంజినీర్లు ఎల్ఎన్వర ప్రసాద్, పి.శుభాకుమార్ ఇతర అధికారులు ఉన్నారు. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ మూడు వేర్వేరు ప్రాజెక్టుల కాలువలకు అనుమతులు మంజూరు చేసింది. అవి... తెలుగుగంగ, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, గాలేరు నగరి సుజల స్రవంతి. రాయలసీమ ఎత్తిపోతల పథకం పురోగతి పనులు జరుగుతున్నట్టుగా ఆ ప్రాంతంలో ఎ లాంటి గుర్తులు లేవు. తొలుత చేపట్టిన పనుల నిమిత్తం నిర్మాణ సామగ్రి ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నాయి. ఎన్జీటీ అనుమతించిన డీపీఆర్‌కు సంబంధించిన పనులు మాత్రమే చేపడుతున్నట్టు ప్రాజెక్టు యాజమాన్యం పేర్కొంది. ఆగస్టు 2021లో కృష్ణాబోర్డు ఎన్జీటీకి నివేదిక సమర్పించిన విషయం గమనించాం. శ్రీశైలం రిజర్వాయరులో నీటి నిల్వ ం854 కన్నా తక్కువ ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డౌన్‌స్ట్రీమ్ కోసం శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం అనే ప్రధాన ధ్యేయంగా ప్రాజెక్టు ప్రారంభించారు. మూడు టీఎంసీల నీటి నిమిత్తం చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం గాలేరు నగరి సుజన స్రవతి, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, తెలుగు గంగ ప్రాజెక్టుల నిమిత్తం ఇచ్చిన పర్యావరణ అనుమతులు సవరించాలంటూ ప్రాజెక్టు యాజమాన్యం ప్రతిపాదనలు పంపింది. రివర్‌వ్యాలీ, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిపుణుల మదింపు కమిటీ దీన్ని అంచనా వేస్తోంది'' అని అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ నివేదికలో పేర్కొంది.