Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే)లో మహిళలకు కూడా అవకాశం కల్పిస్తామని సుప్రీంకోర్టుకు మోడీ ప్రభుత్వం తెలిపింది. అయితే, వారికి ప్రవేశాలు కల్పించేందుకుగానూ మార్గదర్శకాలను తయారు చేసేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరింది. దానికి సమ్మతించిన కోర్టు ఈ నెల 20లోపు వెల్లడించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది. ఎన్డీయేలోకి మహిళలను తీసుకునేందుకు సాయుధ బలగాలు ఒప్పుకోవడం ఆనందంగా ఉన్నదని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక్కరోజులోనే సంస్కరణలన్నీ జరిగిపోవన్న విషయం తమకూ తెలుసనీ, మహిళలకు ఎన్డీయేలోకి తీసుకునే ప్రక్రియ, చర్యలకు కేంద్రం కొంత సమయం తీసుకోవచ్చని సూచించింది. దేశ రక్షణలో సాయుధ బలగాలు కీలకపాత్ర పోషిస్తాయనీ, అయితే, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు బలగాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొంది.
కాగా, ఎన్డీయేతో పాటు నేవల్ అకాడమీలో మహిళలకు అవకాశం కల్పించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఎన్డీయే పరీక్షను మహిళలు అమ్మాయిలూ నెల క్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అమ్మాయిలకు అవకాశం కల్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. దీనిపై అతి త్వరలోనే సవివరణాత్మకంగా అఫిడవిట్‌ను దాఖలు చేస్తామన్నారు. ఎన్డీయే ప్రవేశ పరీక్షను నవంబర్‌కు వాయిదా వేస్తున్నట్టు జూన్ 24న ప్రకటించామనీ, అయితే, ప్రస్తుతం అమ్మాయిలకు అవకాశం కల్పించే అంశంలో చాలా మార్పులు చేయాల్సి ఉన్నందున పరీక్షలపై యథాతథ స్థితిని అమలు చేయాల్సిందిగా కోరారు. అయితే, ప్రస్తుతం తాత్కాలిక కమిషన్ ఆఫీసర్లుగానే తీసుకుంటున్నారు. పురుషులకు ఇచ్చినట్టే మహిళలకు కూడా శాశ్వత కమిషన్ ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.