Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100 కోట్ల ఆస్తుల జప్తు!
చెన్నై : అన్నాడిఎంకె బహిష్కృత నేత శశికళకు ఆదాయ పన్ను శాఖ మరో భారీ షాక్ ఇచ్చింది. పనయూర్‌లో శశికళకు చెందిన రూ.100 కోట్ల విలువైన 49 ఎకరాల భూమిని బినామీ చట్టం కింద అటాచ్ చేసింది. ఈమేరకు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కొద్దిరోజుల క్రితమే ఆమెకు పన్ను మినహాయింపు వర్తించదని ఆదాయ పన్ను శాఖ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఐటి డిపాజిట్ ఆస్తుల నిరోధక చట్టం కింద శశికళ ఆస్తులను జప్తు చేశామని వెల్లడించారు. శశికళకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను ఐటి శాఖ ఇప్పటికే జప్తు చేసింది. జైలు శిక్ష పడిన వ్యక్తికి ఐటి బకాయిల్లో మినహాయింపు వర్తించదని ఐటి వర్గాలు కోర్టుకు స్పష్టం చేశాయి. దీంతో 2008లో ఎసిబి సమర్పించిన నివేదిక మేరకు ఆస్తులకు సంబంధించి రూ.48 లక్షలు పన్ను చెల్లించాలని ఐటి వర్గాలు శశికళను ఆదేశించాయి. దీనిని వ్యతిరేకిస్తూ శశికళ ఐటి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆ పన్ను చెల్లింపు నుంచి గట్టెక్కారు.
అయితే, ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ ఐటి వర్గాలు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాయి. బినామీ చట్టం కింద శశికళకు చెందిన చాలా ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ సీజ్ చేసింది. చెన్నైలో జయలలిత పోయెస్ గార్డెన్ నివాసం ఎదుట శశికళ నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని కూడా ఐటి శాఖ స్వాధీనం చేసుకుంది. మన్నార్గుడితో పాటు పలు ప్రాంతాల్లో ఆమె కొన్న విలువైన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. శశికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ ఆస్తులను కూడా ఐటి శాఖ సీజ్ చేసింది.
అక్రమ ఆస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించిన శశికళ ఇటీవలే బెంగళూర్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.