Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ స్ట్రీట్‌లో మహిళా సంఘాల ఆందోళన
- కేంద్ర హౌం మంత్రికి లేఖ
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక లైంగికదాడి, హత్యకుగురైన రిబియా సైఫీకి న్యాయంచేయాలని మహిళా సంఘాలు డిమాండ్‌చేశాయి. స్థానిక పార్లమెంట్ స్ట్రీట్‌లో ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఏఐఎంఎస్ఎస్, పీఎంఎస్, సీఎస్‌డబ్ల్యూ, ఎస్ఎంఎస్ మహిళాసంఘాలు సంయుక్తంగా బుధవారం నాడిక్కడ ఆందోళన చేపట్టాయి. తొలుత మహిళా సంఘాలనేతలు, కార్యకర్తలు జంతర్‌మంతర్ వద్దకు చేరుకొని అక్కడ నుంచి మార్చ్ నిర్వహించారు. జస్టిస్ ఫర్ రిబియా అంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలి, బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి, మోడీ సర్కార్ ముర్దాబాద్, విధి నిర్వహణలో వున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను ఢిల్లీ పోలీసులు బారికేడ్లను ఏర్పాటుచేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల వలయాన్ని ఛేదించుకుని పార్లమెంట్ స్ట్రీట్‌కు చేరుకున్న మహిళలు అక్కడ ఆందోళనచేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మాట్లాడుతూ రిబియా సామూహిక లైంగికదాడి, హత్యపై ఢిల్లీ పోలీసులు మౌనంగా ఉన్నారనీ, ఇది ఎంత మాత్రమూ మంచిది కాదన్నారు. ఈ ఘటనపై అన్ని వైపుల స్వతంత్ర కాలపరిమితితో కూడిన విచారణ జరపాలనీ, ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలనీ, అన్ని పని ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటుచేయాలని కోరారు.
రిబియా కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలనీ, అలాగే పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆరు మహిళా సంఘాలు కేంద్ర హౌం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని లేఖలో కోరాయి. ఈ కార్యక్రమంలో ఐద్వా నేతలు ఎస్ పుణ్యవతి, ఆశాశర్మ, మైమూనా మొల్లా, సర్బానీ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.