Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన 27న తలపెట్టిన భారత్ బంద్‌కు ఐదు వ్యవసాయ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ మేరకు బుధవారం నాడిక్కడ అజరు భవన్లో ఏఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ, ఎఐఆర్ఎల్ఎ, ఏఐకేఎస్, ఏఐఏకేఎస్యూ సంఘాలు సమావేశం అయ్యాయి. అనంతరం ఆయా సంఘాల నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలిత ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు గత తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్నారనీ, మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు మాత్రమే కాకుండా వ్యవసాయ కార్మికులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నారు. నిత్యావసర వస్తువుల సవరణ చట్టంతో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతున్నదని తెలిపారు. దేశంలో 23 కోట్ల మందికి బీపీఎల్ కార్డులు ఉన్నాయని, 85 కోట్ల లబ్దిదారులు ఉన్నారని అన్నారు. ఈ చట్టం వల్ల బీపీఎల్ కార్డులు తగ్గిస్తారనీ, బ్లాక్ మార్కెట్ పెరుగుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్లు నిత్యావసర వస్తులను నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టిస్తారనీ, ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని అన్నారు. కరోనా ముందు వంట నూనె రూ.85 నుంచి రూ.100 ఉండేదనీ, అదే ఇప్పుడు రూ.200 దాటిందని వివరించారు. ప్రభుత్వ భూములను పేదలకు పంచాల్సి ఉంటుందనీ, కానీ ఈ చట్టాలతో భూములను కార్పొరేట్లకు ప్రభుత్వం కట్టబెడుతున్నదని తెలిపారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ల్యాండ్ మాఫియా వ్యవసాయన్ని నియంత్రిస్తున్నారని చెప్పారు. కనుక భారత్ బంద్‌కు వ్యవసాయ కార్మిక సంఘాలుగా మద్దతు ఇస్తున్నామనీ, దేశంలో ఉండే 20 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు బంద్‌లో పాల్గొంటారని వెల్లడించారు. వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనులు నిలిపివేస్తారని చెప్పారు. ఉపాధి హామీకి గత యూపీఏ ప్రభుత్వం బడ్జెట్లో 4 శాతం నిధులు కేటాయిస్తే, మోడీ ప్రభుత్వం కేవలం రూ.2 శాతం మాత్రమే కేటాయిస్తున్నదని విమర్శించారు. ఈ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 28 శాతం ఉపాధి హామీకి (రూ.పది వేల కోట్లు) నిధులు తగ్గించారని అన్నారు. తాము ఉపాధి హామీకి రెండు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామనీ, మరోవైపు కేంద్రం నిధులు తగ్గిస్తుందని విమర్శించారు. 200 రోజుల పనిదినాలు ఇవ్వాలనీ, రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో రెండు కోట్ల మంది వలస కార్మికులు, మూడు కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఉపాధి హామీలో యంత్రాలపై చేసే ఖర్చును 4 శాతం నుంచి 10 శాతానికి పెంచి, ఉపాధి హామీ పనులను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. హర్యానాలోని కర్నాల్‌లో జరుగుతున్న రైతు ఉద్యమం అక్కడి ప్రభుత్వం క్రిమినల్ వైఖరిని ప్రదర్శిస్తుందని విమర్శించారు.
బీకేఎంయూ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, లేబర్ కోడ్స్ వల్ల రద్దు అయిన హక్కులను పునరుద్దరించి నూతన కార్మిక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులందరి ఉచిత కరోనా వ్యాక్సిన్ అందించాలనీ, కరోనాతో చనిపోయిన వారందరికీ రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. రాజ్యసభ ఎంపీ వి.శివదాసన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ కార్మికుల చట్టం చేయాలనీ, అలాగే పట్టణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కేటాయింపులను రెట్టింపు చేయాలని కోరారు. ఉపాధి హామీ చట్టానికి విరుద్ధంగా ఇచ్చిన కుల విభజన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్కేఎస్ నేత ఆసిత్ గంగూలీ మాట్లాడుతూ లైంగికదాడులకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీలను కాపాడే చట్టాన్ని బలోపేతం చేయాలనీ, నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు భూమిలేని వారందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు, భూమి ఇవ్వాలని కోరారు. ఏఐఏకేఎస్యూ ధర్మేంద్ర వర్మ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులందరికీ పది కేజీల ఆహార ధాన్యాలు ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులందరినీ రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమయంలో సునీత్ చోప్రా (ఏఐఏడబ్ల్యూయూ), వి.ఎస్ నిర్మల్ (బీకేఎంయూ), శ్రీరామ్ చౌదరి (ఎఐఆర్ఎల్ఎ) తదితరులు పాల్గొన్నారు.