Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అగర్తలాలోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయా నికి బుధవారం బీజేపీ గూండాలు నిప్పంటించారు. బయట పార్క్ చేసి వున్న పలు వాహనాలను తగలబెట్టారు. ఇటీవల సెఫాహిజలా జిల్లాలో ధన్పూర్ వద్ద సీపీఐ(ఎం) కార్యకర్తలతో ఘర్షణకు నిరసనగా వారీ దాడులకు తెగబడ్డారు. దినపత్రిక ప్రతివాది కలామ్ కార్యాలయంపై కూడా దుండగులు దాడి చేశారు. మొత్తంగా భవనాన్ని ధ్వంసం చేశారు. ఆ పత్రిక సంపాదకుని వాహనాన్ని నాశనం చేశారు. జర్నలిస్టుల మోటార్‌బైక్‌లను తగలబెట్టారు. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు గాయపడగా, వారిలో ఇద్దరిని అస్పత్రిలో చేర్చారు. సీపీఐ(ఎం) వాణిని వినిపించే దినపత్రిక దేశర్ కథ కార్యాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. ఇటీవల ప్రతిపక్ష సీపీఐ(ఎం)చేపట్టిన రాజకీయ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరైన నేపథ్యంలో అగర్తలా లోని మేలార్మత్ ప్రాంతంలో ఒక ప్రణాళిక ప్రకారం మూడు భవనాలపై దాడులు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంత ధ్వంసం జరుగుతున్నా పోలీసులు, పేరా మిలటరీ బలగాలు కేవలం మౌన పాత్ర వహించాయని సీపీఐ(ఎం) విమర్శించింది. వివిధ పార్టీ కార్యకర్తలు, నేతల ఇండ్లపై కూడా దాడులు జరిగాయి. కామ్రేడ్ పార్థప్రతిమ్ మజుందార్ ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమై పోయింది. బిశాల్ఘర్లోని సీపీఐ(ఎం) కార్యాలయాన్ని కూడా బీజేపీ దుండగులు తగలబెట్టారు. వారికి పోలీసులు సహకరించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర మొదటి గిరిజన ముఖ్యమంత్రి దశరథ్ దేవ్ విగ్రహం కూడా ఈ దాడుల్లో దెబ్బతింది. ఇదిలావుండగా త్రిపుర జర్నలిస్టు యూనియన్ పత్రికా కార్యాలయాలపై జరిగిన దాడులను ఖండించింది. బీజేపీ గూండాలు పోలీసులతో కుమ్మక్కై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సీపీఐ(ఎం) కార్యాలయాలపై వరుస దాడులకు దిగారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ వారీ దాడులకు తెగబడుతున్నారు. త్రిపుర పశ్చిమ జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయంలో పోలీసులే కనబడుతున్నారు. బీజేపీ నాయకత్వం మౌనంగా వుండడంతో ఈ తరహా దాడులు కొనసాగుతునే వున్నాయి. ఈ దాడులు సిగ్గుచేటని సీపీఐ(ఎం) పేర్కొంది.
సీపీఐ(ఎం) ఖండన
త్రిపురలోని పలు జిల్లాల్లో సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయా లపై బీజేపీ అల్లరి మూకలు జరిపిన దాడులను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఒక పద్ధతి ప్రకారం పకడ్బందీగా ఈ దాడులు చేశారని పేర్కొంది. రాష్ట్ర కార్యాలయంలోకి కూడా ఆ మూకలు ప్రవేశించాయని అక్కడ వున్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని తెలిపింది. త్రిపురలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న పార్టీని ఏదో ఒక రకంగా నిలువరించి, నోరు మూయించాలన్న లక్ష్యంతో జరిపిన ఫాసిస్ట్ దాడి అని విమర్శించింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని బీజేపీ ఉపయోగించుకుంటోందని, ఈ పిరికిపంద దాడులను తక్షణమే నిలిపివేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన సిపిఎం తక్షణమే ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.