Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాచల్‌ప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు
సిమ్లా : దేశంలో ప్రతిరంగంలోనూ ఉన్న కులవివక్ష.. మిడ్ డే మీల్ పథకంనూ పట్టి పీడిస్తున్నది. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి మరింత తీవ్రమయ్యాయి. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు అధికంగా కనబడుతున్నాయి. ఇందుకు హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహరణ. హిమాచల్‌ప్రదేశ్‌లో దళితుల సంఖ్య గణనీయంగా ఉన్నది. 25.2శాతం మందితో దేశంలో దళితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం రెండో స్థానంలో ఉన్నది. అక్కడి ఎన్నికల్లోనూ వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలంటే వారి ఓట్లు చాలా కీలకం. కానీ, ప్రభుత్వ పథకాల్లో మాత్రం దళితులకు స్థానం దక్కడం లేదు. ఇందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యహ్న భోజన పథకమే ఉదాహరణ. అయితే, వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఇవి ఏ మాత్రం అమలుకావడం లేదు. హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక జిల్లాలు, పంచాయతీలు, గ్రామాల్లోని పాఠశాలలో మిడ్ మీల్ వంట మనుషుల్లో దళితులు కనబడటం చాలా అరుదు. ఇక కొన్ని జిల్లాల్లో అయితే దళితులను నియమించే సాహసమే చేయకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 2020 నాటికి రాష్ట్రంలో 21,533 మంది వంట మనుషులు, హెల్పర్లు.. మిడ్ డే మీల్ పథకంలో భాగంగా ఉన్నారు. అయితే, ఇందులో ఉన్న దళితుల సంఖ్య 3,609 గా మాత్రమే ఉన్నది. అంటే కేవలం 16.6 శాతం మంది మాత్రమే దళితులు ఉన్నారు. ఈ పథకంలో వంట మనుషులుగా దళితులను నియమించకపోవడానికి ప్రధాన కారణం పెత్తందారీ కులాల ఒత్తిడే కారణమని దళిత సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ''స్కూళ్లలో టీచర్లుగా, ప్యూన్లుగా దళితులు ఉన్నారు. అయితే, వారు వండిన భోజనాన్ని మాత్రం తినడానికి ఎవరూ సాహసం చేయరు'' అని ఓ పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడొకరు చెప్పడం గమనార్హం. ఇక్కడి ప్రజలకు కులం పట్టింపు ఎక్కువ. కాబట్టి దళితులను వంట వారిగా నియమించడమనేది సాహసమే. ముఖ్యంగా, పెత్తందారీ కులాల పిల్లల తల్లిదండ్రులు వారు వండిన ఆహారాన్ని తినడానికి ఏ మాత్రమూ ఒప్పుకోరు'' అని మరొక వ్యక్తి తెలపడం గమనార్హం.