Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు స్థానాలకు అక్టోబర్ 4న పోలింగ్
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. అక్టోబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల (సెప్టెంబర్) 15న జారీ కానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అలాగే ఓట్ల లెక్కింపు కూడా అక్టోబర్ 4న ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీలోనే ఓటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతతో పాటు కరోనా మార్గదర్శకాల మధ్య ఉప ఎన్నికలు నిర్వహించనుంది. ఏడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలతోపాటు బీహార్‌లో ఒక శాసన మండలి స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనున్నది. అలాగే ఇటీవల ప్రకటించిన పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను కూడా ఈసీ జారీ చేసింది.
మానస్ రంజన్ భునియా (పశ్చిమ బెంగాల్), బిశ్వజిత్ డైమరీ (అసోం), తిరు. కె.పి. మునుసామి (తమిళనాడు), తిరు. ఆర్. వైతిలింగం (తమిళనాడు), థావర్‌చంద్ గెహ్లాట్ (మధ్యప్రదేశ్) రాజీనామా చేయడం, రాజీవ్ శంకర్రావ్ సాతవ్ (మహారాష్ట్ర) మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. బీహార్‌లో ఎమ్మెల్సీ తన్వీర్ అక్తర్ మరణించటంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. తమిళనాడులో రెండు, అసోం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో చెరో ఒక్కొక్కటి మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక పుదుచ్చేరి రాజ్యసభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్ గోకుల కష్ణణ్ పదవీకాలం అక్టోబర్ 6 తో ముగియనుంది. ఈ స్థానానికి కూడా ఉప ఎన్నికలతో పాటే ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ తాజా షెడ్యూల్లో పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ప్రకటన జారీ చేసింది.