Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో రోజు కొనసాగిన మినీ సచివాలయం ఘెరావ్
- ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ల నిషేధం పొడిగింపు
న్యూఢిల్లీ : కర్నాల్‌లో మూడో రోజు కూడా వేలాది మంది రైతులు మినీ సచివాలయం ఘెరావ్ నిర్వహించారు వేలాది మంది రైతులు మినీ సచివాలయం ముందు శిబిరాలు, గుడారాలను ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభించింది. హర్యానా, ఇతర రాష్ట్రాల్లో అనేక ప్రదేశాల్లో కర్నాల్ ఆందోళనకు మద్దతుగా రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీస్‌ల నిషేధం పొడిగించారు. వేలాది మంది భద్రతా సిబ్బంది మోహరించారు.హంతక అధికారిని రక్షించేందుకు హర్యానాలోని బీజేపీ-జేజేపీ ప్రభుత్వ ప్రయత్నాలుచేస్తున్నదని సంయుక్త కిసాన్ మోర్చా విమర్శించింది. రైతులపై చర్యలు తీసుకుంటామని బెదిరించిన హర్యానా హౌం మంత్రి అనిల్ విజ్ ప్రకటనను ఎస్కేఎం ఖండించింది. ''హర్యానా ప్రభుత్వం తన రైతు వ్యతిరేక ఎజెండాను బహిర్గతం చేసింది. ఇది మొదటి నుంచి వ్యవసాయ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. రైతులు, రైతు నాయకులపై అనేక కేసులు పెట్టింది. ఇంకా రైతుల తలలు పగలగొట్టాలని ఆదేశించిన అధికారిని ప్రోత్సహిస్తుంది. మద్దతు ఇస్తుంది. రైతుల తలలు పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తుంది'' అని ఎస్కేఎం విమర్శించింది. కాగా, భారత్ బంద్ కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అనేక వ్యవసాయ కార్మిక సంఘాలు, రాజకీయ సంస్థలు ఉద్యమానికి తమ మద్దతును ప్రకటించాయి.
లక్నోలో ఎస్కేఎం రాష్ట్ర స్థాయి సమావేశం
ముజఫర్‌నగర్ కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్‌లో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా గురువార లక్నోలో ఎస్కేఎం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఇందులో 80కి పైగా రైతు సంఘాలకు చెందిన వందలాది మంది నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో తదుపరి దశ ఉద్యమం కోసం చేసిన ప్రణాళికలతో సమావేశం శుక్రవారం ముగుస్తుంది. సమావేశాన్ని ఉద్దేశించి ఎస్కేఎం నేతలు దర్శన్ పాల్, అశోక్ ధావలే మాట్లాడారు. ముజఫర్‌నగర్ ర్యాలీ చారిత్రాత్మక విజయానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. యూపీలో రైతుల సమస్యలపై పోరాటం చేపట్టడం ద్వారా మహాపంచాయత్‌లను వ్యవస్థీకృత, ఐక్య పద్ధతిలో నిర్వహించాలని పిలుపు నిచ్చారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం కోసం పని చేయాలని సూచించారు. ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ కూడా సమావేశానికి హాజరయ్యారు.