Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందస్తు ప్రణాళికతోనే దాడులు : ప్రధానికి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లేఖ
న్యూఢిల్లీ: త్రిపురలో సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయాలపై ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీజేపీ వ్యక్తులతో కూడిన మూకలు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. ''ముందస్తు ప్రణాళిక ప్రకారమే సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయం సహా ఇతర ఆఫీసులపై బీజేపీ వ్యక్తులతో కూడిన మూకలు దాడికి తెగబడ్డాయి. దెబ్బతిన్న కార్యాలయాల్లో ఉదరుపూర్ సబ్ డివిజన్ ఆఫీస్, గోమతి జిల్లా కమిటీ ఆఫీసు, సెపహిజల జిల్లా కమిటీ కార్యాలయం, బిషాల్గఢ్ సబ్ డివిజన్ కార్యాలయం, సంతర్ బజార్ సబ్ డివిజన్ కార్యాలయం, పశ్చిమ త్రిపుర జిల్లా కార్యాలయం, సదర్ డివిజన్ కమిటీ కార్యాలయాలు ఉన్నాయనీ'' పేర్కొన్నారు. ''అగర్తలాలోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంపై అత్యంత ఘోరమైన దాడి జరిగింది. ఆఫీసులను ధ్వంసం చేయడంతో పాటు కార్యాలయాల ముందున్న కార్లను తగులబెట్టారు. త్రిపుర ప్రజల గౌరవనీయ నాయకుడు దశరథ్దేవ్ విగ్రహాన్ని కూడా పగులగొట్టారు. అలాగే, సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తల ఇండ్లపై దాడి జరిగింది. సీపీఐ(ఎం) వాణిని వినిపించే డైలీ దేశ్కథ దినపత్రిక కార్యాలయంపై దాడి చేశార''ని లేఖలో పేర్కొన్నారు. దాడులు జరుగుతున్నప్పటికీ అక్కడున్న పోలీసులు గమ్మునుండిపోయారు. రాష్ట్ర కమిటీ ఆఫీసు వద్ద అప్పటివరకు అక్కడే ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది.. దాడులు ప్రారంభమయ్యే గంటముందు వారిని ఉపసంహరించుకున్నారని పేర్కొంటూ సంబంధిత వివరాలను జతచేశారు. దాడులకు పాల్పడిన వ్యక్తులకు శిక్షలు విధించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష సహకారానికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాల కార్యకలాపాలను అధికార పార్టీ అణచివేయడానికి ప్రయత్నించి విఫలమైన నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయని లేఖలో పేర్కొన్నారు. సీపీఐ(ఎం), లెఫ్ట్పార్టీలపై జరుగుతున్న ఈ హింసాత్మక దాడులను ఆపడానికి నిర్లక్ష్యం వహించకుండా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరుతున్నామని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటం, రాజ్యాంగ విలువలను అనుసరించడం, హక్కులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే దానిని ఈ దాడులు జరిగిన తీరు స్పష్టం చేస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేయడం, నేరస్తులపై కేసులు నమోదులో పోలీసుల అలసత్వంపై చర్యలకు తీసుకోవడంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు.
ప్రజాస్వామ్యంపై బీజేపీ-సంఘ్ పరివార్ అనాగరిక దాడులు ఆపండి: ఏఐకేఎస్, సీఐటీయూ
సీపీఐ(ఎం) సహా ఇతర వామపక్షాలు, ప్రజాసంఘాలు, సమాజిక కార్యకర్తలు, హక్కుల కార్యకర్తలపై బీజేపీ-సంఘ్ పరివార్లు అనాగరిక దాడులను అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఖండించింది. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వామపక్షాలు, ఏఐకేఎస్, సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూ సహా ఇతర ప్రజా సంఘాలు భారీ ప్రతిఘటన నేపథ్యంలోనే రాష్ట్ర యంత్రాంగాన్ని ఉపయోగించు కుని జరిగిన అనాగరిక దాడులు పిరికి చర్యలుగా అభివర్ణించింది. దశరథ్దేబ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించింది. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన ఈ దాడిని ఖండించాలంటూ ప్రజాస్వామ్య భావాలు కలిగిన వ్యక్తులు, సంస్థలకు పిలుపునిచ్చింది. అలాగే, ఈ దాడులను సీఐటీయూ సైతం ఖండించింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడటం దారుణమైన చర్య అనీ, ప్రజల కష్టాలను మరింతగా పెంచిందని పేర్కొంది. బీజేపీ పాలన దుర్మార్గపు అణిచివేత చర్యలను ప్రతిఘటించాలని ప్రజలకు, ప్రజా సంఘాలకు సీఐటీయూ పిలుపునిచ్చింది.