Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింగ వివక్ష.. వేతనాలూ తక్కువే..
- శ్రామిక శక్తిలో గుర్తింపు శూన్యం : తాజా అధ్యయనం
న్యూఢిల్లీ: దేశంలో ప్రతిరంగం లోనూ మహిళలు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. వారికి తగిన గుర్తింపు లభించడం లేదు. ప్రతిరంగంలోనూ లింగ వివక్షను ఎదుర్కొంటున్నారు. శ్రమకు తగిన వేతనాన్ని వారు పొందడం లేదు. దేశ శ్రామిక శక్తిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న మహిళలు.. ఇక్కడా అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ శ్రమకు తగిన గుర్తింపునకు నోచుకోక తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇనిషియేటివ్ ఫర్ వాట్ వర్క్స్ టు అడ్వాన్స్ ప్రచురించిన పేపర్ ప్రకారం.. భారతదేశంలో లేబర్ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లలో (ఎల్ఎఫ్పీఆర్) స్త్రీ-పురుష అంతరాలు తీవ్రంగా, నిరంతరాయంగా ఉన్నా యి. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళ లు, ఆదివాసీ మహిళల విషయంలో ఇది అధికం గా కనిపిస్తున్నది. అశోక విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ అశ్వినీ దేశ్పాండే రచించిన ఈ పేపర్ ప్రకారం ''తక్కువస్థాయికి, క్షీణతకు అనేక అంశా లు, వివరణలు ఉన్నాయి. మహిళల ఆర్థిక పనిని సరిగ్గా లెక్కించడానికి గణాంక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడంలేదు. శ్రామిక శక్తి గణాంకాలు చూపించినదాని కంటే అధిక సంఖ్యలోనే మహిళలు ఆర్థిక పనిలో భాగస్వామ్యమవుతున్నారు'' అని పేర్కొన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలకు వచ్చే వేతనాలూ తక్కువగానే ఉన్నాయి. దశాబ్ద కాలంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పడిపోయింది. మహిళల విద్యా సాధన అధికంగా పెరగడం గమనార్హం. '' 2010లో మహిళలకు పురుషుల లాగే చెల్లింపులు జరిగి ఉంటే మహిళల సగటు వేతనాలు పురుషుల కంటే ఎక్కువగా ఉండేవి. ఇందులో మహిళలు ఎదుర్కొన్న వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది'' అని వివరించారు. సామాజిక అంశాలు కూడా మహిళలపై తీవ్రంగా ప్రభావం చూపాయి. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంత మహిళలు, దళిత మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు. స్వయం ప్రతిపత్తి, చైతన్యం వంటి విషయాల్లోనూ మహిళలు వెనకబడిపోయారు. స్వయం ఉపాధిలో లింగ అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి రూపొందించిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎమ్) వంటి విధానాలు సాధికారత, స్వయం ప్రతిపత్తి పెరుగుదల వంటి అనేక ఇతర సానుకూల ప్రభావాలను కలిగి ఉన్నాయి. శ్రామికశక్తి భాగస్వామ్య రేటు, నిరుద్యోగరేటు భారత్లో అధికంగా ఉన్నది. ఇది ప్రపంచ సగటు కంటే తక్కువ కావడం గమనార్హం. ఈ అంశాల్లో తూర్పు ఆసియా సగటు 63 శాతంగా ఉన్నది.