Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలల్లో పెట్రోల్, డీజిల్పై రూ.లక్ష కోట్లకుపైనే
- 48 శాతం పెరిగిన ఎక్సైజ్ పన్ను
- ఇదంతా రైతులు, కార్మికుల సొమ్మే : ఆర్థిక నిపుణులు
- చమురు బాండ్ల చెల్లింపుల కోసమనే కేంద్రం వాదన తప్పు..
ప్రజలపై పన్నుల మోత మోగిస్తూ..కేంద్రం తన ఖజానా నింపుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై(నాలుగు నెలలు)లో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ పన్ను విధింపు ద్వారా కేంద్ర ఖజానాకు ఆదాయం రూ.లక్ష కోట్లు దాటింది. ఈ సంగతి కేంద్ర ఆర్థికశాఖకు చెందిన 'కంట్రోలర్ జనరల్ అకౌంట్స్' స్వయంగా వెల్లడించింది. ఇదంతా కూడా దేశంలోని రైతులు, కార్మికుల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తం. మరి..ఇలా వసూలైన లక్షల కోట్లు...రైతుల కోసం, కార్మికుల కోసం ఖర్చు చేస్తున్నారా? అంటే...కేంద్రం నుంచి సమాధానం లేదు.
న్యూఢిల్లీ : లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.వంద దాటాయి. ఇంధన ధరల పెంపు సరుకు రవాణా, ప్రయాణికుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యావసర సరుకుల ధరల పెంపునకు దారితీసింది. దాంతో ఈ ఎక్సైజ్ పన్ను తగ్గించాలని మోడీ సర్కార్కు విన్నపాల మీద విన్నపాలు వెళ్లాయి.
అయితే ప్రజల గోడు వినే పరిస్థితిలో కేంద్రం లేదని తేలిపోయింది. ధరల తగ్గింపునకు అవకాశమే లేదని ప్రకటించింది. యూపీఏ 1, 2 ప్రభుత్వాలు 2014కు ముందు చేసిన 'చమురు బాండ్ల' అప్పులు, వాటి వడ్డీల చెల్లింపు భారం తమపై పడిందని, అందుకే ఇంధన ధరలు తగ్గించలేకపోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. ఇది పూర్తిగా అబద్ధమని ఆర్థిక నిపుణులు గట్టిగా వాదిస్తున్నారు. చమురు బాండ్ల చెల్లింపు, వడ్డీలకు ఈ ఏడాది రూ.10వేల కోట్లు అవసరమవుతాయని, చమురు బాండ్ల చెల్లింపును కారణంగా చూపి..దేశ ప్రజల నుంచి లక్షల కోట్లు పన్ను వసూళ్లకు మోడీ సర్కార్ తెరలేపిందని నిపుణులు విమర్శిస్తున్నారు.
భారీగా పెరిగిన పన్ను ఆదాయం
మనదేశంలో అత్యధికశాతం మంది రైతులు, కార్మికులు, చిన్న చిన్న ప్రయివేటు ఉద్యోగాలు చేసుకునేవారే ఉన్నారు. నేడు కేంద్ర ఖజానాలో ఎక్సైజ్ పన్ను ఆదాయం రూ.లక్ష దాటిందంటే...అదంతా రైతులు, కార్మికుల జేబులో నుంచి లాక్కున్నదే. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులైలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ పన్ను ఆదాయం రూ.68,895కోట్లు కాగా..ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులైలో ఆదాయం రూ.లక్ష కోట్లు దాటింది. పన్ను ఆదాయంలో పెరుగుదల (48శాతం) రూ.32,492కోట్లు. మరి ఇలా వచ్చిన ఆదాయమంతా ఎటు పోతోందో ప్రజలకైతే తెలియదు. ఎవరికోసం ఖర్చు చేస్తుందో మోడీ సర్కార్ చెప్పటం లేదు. ఇంధన ధరల పెంపు, ఎక్సైజ్ పన్ను భారీగా ఉండటం..ఇదంతా గత యూపీఏ ప్రభుత్వాలు చేసిన చమురు బాండ్ల వల్లేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. అయితే ఆమె మాటల్లో నిజం లేదని తాజా గణాంకాలు నిరూపిస్తున్నాయి.
చమురు బాండ్లకు ఎంత?
ఇంధన ధరలు పెరగకుండా, అందుబాటు ధరల్లో ఉండటం కోసం గత యూపీఏ ప్రభుత్వం చమురు మార్కెటింగ్ సంస్థల పేరు మీద చము రు బాండ్లను అమ్మింది. ప్రతి ఏటా బాండ్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం తో చమురు ధరల నియంత్రణ చేపట్టామని యూపీఏ ప్రభుత్వం చెప్పు కుంది. అయితే ఆ బాండ్లకు సంబంధించి మొత్తం..రూ.1.30లక్షల కోట్ల అప్పులు..యూపీఏ తర్వాత వచ్చిన తమపై పడ్డాయని ఎన్డీయే ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ బాండ్ల మెచ్యురిటీ ఏదీ 2015-21 మధ్యకాలంలో లేదు. కానీ వీటిపై వడ్డీ రూ.9990కోట్లు మాత్రం ప్రతిఏటా చెల్లిస్తోంది. మోడీ సర్కార్ గత ఆరేండ్లలో చెల్లించిన వడ్డీ మొత్తం సుమారుగా రూ.59 వేల కోట్లు ఉంటుంది.
ఖజానాకు 14.60లక్షల కోట్లు.. వడ్డీ చెల్లింపులు కేవలం 59వేల కోట్లే..
బాండ్ల చెల్లింపు పేరు చెబుతూ కేంద్రం నిత్యం ఇంధన ధరల్ని పెంచుతూ పోతోంది. ఎక్సైజ్ పన్నును భారీగా పెంచింది. ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తూ..గత ఆరేండ్లలో కేంద్రం వసూలు చేసిన పన్ను ఆదాయం సుమారుగా రూ.14 లక్షలా 60వేల 36 కోట్లు ఉంటుందని తేలింది. ఇందులో కేవలం 4శాతం(రూ.59వేల కోట్లు) చమురు బాండ్లపై వడ్డీ చెల్లింపులకు వెళ్లింది. మిగతాదంతా కేంద్రం తన ఖజానాలో వేసుకుంది. దేనికోసం ఇంతపెద్ద మొత్తాన్ని వసూలు చేశారో చెప్పటం లేదు. ఈ పన్ను ఆదాయం, దీనిని ఎలా ఖర్చు చేస్తున్నారు? అని ప్రతిపక్షాలు, మేధావులు, పౌర హక్కుల కార్యకర్తల ప్రశ్నిస్తే..పన్నులు విధించటం, వసూలు చేయటం మా హక్కు అని మోడీ సర్కార్ వాదిస్తోంది.