Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ ముఖ్యమంత్రి రూపానీ రాజీనామా
న్యూఢిల్లీ/అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాజకీయాల్లో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజరురూపానీ తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని ఆయన గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు సమర్పించారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. రూపానీ రాజీనామాతో గత ఆరు నెలల కాలంలో మూడు రాష్ట్రాల్లో బిజెపి మార్చిన ముఖ్యమంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది. రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులను బిజెపి హైకమాండ్ దుస్తులను మార్చినట్లు మార్చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సిఎం మార్పులకు ఆ పార్టీ బయటకు చెబుతున్న కారణాలేమైనప్పటికీ.. ఆయా రాష్ట్రాల్లోని పార్టీల నేతల్లో నెలకొన్న అంతర్గత కుమ్మలాటలే ఇందుకు ప్రధానంగా కారణంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త సిఎం రేసులో..
రూపానీ రాజీనామాతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. పార్టీ శాసనసభపక్షం సమావేశమైన తర్వాతి సిఎంను ఎన్నుకోనుంది. ముఖ్యమంత్రి రేసులో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్షుక్ మాండవీయ, గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్, రాష్ట్ర మంత్రి ఆర్సి.ఫల్దూ, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రఫుల్ పటేల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.